నయీం ఆస్తుల విలువ ఇదీ: అటాచ్‌మెంట్‌కు ఐటీ శాఖ పిటిషన్

By narsimha lodeFirst Published Jan 4, 2019, 5:52 PM IST
Highlights

గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులను అటాచ్ చేసేందుకు ఐటీ శాఖ రంగం సిద్దం చేసింది. ఈ మేరకు  కోర్టులో  ఐటీ శాఖ  కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నయీం ఆస్తులు బినామీల పేర్ల మీదే ఉన్నాయని ఐటీ శాఖ గుర్తించింది.


హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులను అటాచ్ చేసేందుకు ఐటీ శాఖ రంగం సిద్దం చేసింది. ఈ మేరకు  కోర్టులో  ఐటీ శాఖ  కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నయీం ఆస్తులు బినామీల పేర్ల మీదే ఉన్నాయని ఐటీ శాఖ గుర్తించింది.

 గ్యాంగ్‌స్టర్ నయీంను  ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్‌లో 2016 ఆగష్టు 9వ తేదీన పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సెటిల్మెంట్‌ల పేరుతో నయీం వేలాది కోట్లను సంపాదించారని ప్రచారం ఉండేది. నయీం మృతి చెందాక ఆయన ఆస్తులను ఐటీ శాఖ లెక్క కట్టింది.

నయీంకు చెందిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారంగా సుమారు రూ. 1200 కోట్లు ఉంటాయని ఆదాయపు పన్ను శాఖ తేల్చింది.  అయితే ఈ ఆస్తులన్నీ కూడ బినామీల పేర్లపైనే ఉన్నాయని కూడ అధికారులు గుర్తించారు.

దీంతో ఈ ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు ఆదాయపు పన్ను శాఖ రంగం సిద్దం చేసింది. ఎజ్యూటికేటింగ్ ఆధారిటీలో బినామీ ప్రాపర్టీ కింద ఈ ఆస్తులను అటాచ్ చేయాలని ఐటీ శాఖ తలపెట్టింది. 

1993 జనవరి 23వ తేదీన అప్పటి పీపుల్స్‌వార్‌ గ్రూప్‌లో పనిచేసిన నయీం హైద్రాబాద్ ఎల్బీ స్టేడియంలో   ఐపీఎస్ అధికారి వ్యాస్‌ను హత్య చేసి సంచలనం సృష్టించారు.

ఈ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.జైలులో ఉన్న సమయంలో సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను పీపుల్స్ వార్ గ్రూప్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది.

వ్యాస్ కేసులో నయీం 1993 ఫిబ్రవరి 12వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని 2000 మే 4వ తేదీన జైలు నుండి విడుదలయ్యారు. అదే ఏడాది నవంబర్ మాసంలో ఎపీసీఎల్‌సీ నేత పురుషోత్తం ను హత్య చేసిన కేసులో మరోసారి అరెస్టయ్యాడు.

2007లో నయీం కోర్టు కేసుకు హాజరై తిరిగి వస్తుండగా నాటకీయ పరిణామాల నేపథ్యంలో  తప్పించుకొన్నాడు.  ఆ తర్వాత నుండి సెటిల్మెంట్లు చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహరంలో కొందరు పోలీసులు కూడ నయీంకు సహకరించేవారనే ఆరోపణలు కూడ వచ్చాయి. నయీం కేసును విచారించిన సిట్ ఈ విషయమై ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.

click me!