CM Revanth Reddy: గృహజ్యోతి, రూ.500 సిలిండర్‌ పథకాల ప్రారంభానికి సన్నాహాలు.. ఎప్పుడంటే..?   

Published : Feb 22, 2024, 11:17 PM IST
CM Revanth Reddy: గృహజ్యోతి, రూ.500 సిలిండర్‌ పథకాల ప్రారంభానికి సన్నాహాలు.. ఎప్పుడంటే..?   

సారాంశం

CM Revanth Reddy: మరో రెండు గ్యారంటీల అమలు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తున్నది. వీటి ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. మొత్తానికి వారం రోజుల్లో గృహజ్యోతి, రూ.500 సిలిండర్‌ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

CM Revanth Reddy: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో రెండు హామీల అమలుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. గురువారం ప్రజా పాలన కార్యక్రమంపై సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. ఆరు గ్యారంటీల అమలుపై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క తో కలిసి కేబినెట్‌ సబ్‌కమిటీతో చర్చించారు. ఈ క్రమంలో గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.  

ఇప్పటికే రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే పథకాలను అమలు చేస్తుంది. వాటి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ తరుణంలో తాజాగా మరో రెండు గ్యారంటీలుగా గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే గృహజ్యోతి, రూ.500 సిలిండర్‌ పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు.
  
ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా.. ఏజెన్సీలకు చెల్లించాలా..? అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లయిస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్నిఅనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 

ఎలాంటి అనుమానాలు అపోహాలకు తావు లేకుండా గృహ జ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు . తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు. 

ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. సవరించుకునే అవకాశమివ్వాలని సీఎం సూచించారు. విద్యుత్తు బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్తు శాఖ తగినంత ప్రచారం కూడా చేపట్టాలన్నారు. తప్పులను సవరించుకున్నఅర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింపజేయాలని చెప్పారు. అర్హులందరికీ ఈ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు.   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu