ఈ నెల 6వ తేదీ నుండి మేడారం నుండి యాత్ర ప్రారంభిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు.
రాహుల్ గాంధీ సందేశాన్ని ఈ యాత్ర ద్వారా ప్రజలకు అందిస్తామన్నారు.
హైదరాబాద్: ఈ నెల 6 నుంచి మేడారం నుంచి యాత్ర మొదలు కానుందని టీపీసీసీ చీఫ్. రేవంత్ రెడ్డి చెప్పారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీల పరిధిలో తాను ఈ యాత్రలో ప్రత్యక్షంగా పాల్గొంటానని రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైద్రాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలంతా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని రాహుల్ సందేశాన్ని ఇంటింటికి చేరవేస్తారన్నారు. కొత్త నియామకాలు చేపట్టేవరకు పాత మండల అధ్యక్షులే హాత్ సే హాత్ జోడో యాత్రకు పని చేస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ నెల 24,25,26 ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్ గఢ్ లో జరుగుతాయన్నారు. ఈ మూడు రోజులు యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2003 పరిస్థితులే 2023 లో దాపురించాయన్నారు. 2014 నుంచి 2017 వరకు రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. 2017 నుంచి ఇప్పటివరకు రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. .
నిరుద్యోగుల ఆత్మహత్యలు కూడా పెరిగాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అమరుల కుటుంబాలు అనాధలుగా మారాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. .ధరణి పోర్టల్ తో విపరీతమైన సమస్యలు వచ్చాయన్నారు. రాజులు, రాచరికం మీద గిరిజన హక్కుల కోసం సమ్మక్క సారక్క రక్తం చిందించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అదే స్ఫూర్తితో దొరల మీద పోరాటం చేసేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకే తానులోని ముక్కలుగా ఆయన పేర్కొన్నారు.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నాటకాలకు తెర లేపారని ఆయన విమర్శించారు. నిన్నటి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో వారి నాటకం బట్టబయలైందన్నారు.గవర్నర్ తో పచ్చి అబద్దాలు చెప్పించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. .
119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లిచ్చారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం కీలక మంత్రుల సొంత గ్రామాల్లోనైనా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చారా? అని రేవంత్ రెడ్డి అడిగారు.
కేసీఆర్ స్వగ్రామం చింతమడక, ఎర్రబెల్లి స్వగ్రామం,, హరీష్ రావు స్వగ్రామంలో మిషన్ భగీరథ కింద ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చాారా అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా చేసి కేసీఆర్ అబద్ధాలతో కప్పి పుచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ భ్రమల నుంచి తెలంగాణ సమాజం బయటపడాలని రేవంత్ రెడ్డి కోరారు.
also read:రేవంత్ రెడ్డి పాదయాత్రపై మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం: హట్ హట్ గా కాంగ్రెస్ సీనియర్ల సమావేశం
రాష్ట్రంలో బీఆరెస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కేటీఆర్ కు క్యాట్ వాక్, డిస్కో డాన్స్ ల గురించి మాత్రమే తెలుసునన్నారు. దేశ సమగ్రత గురించి మాట్లాడేంత అవగాహన కేటీఆర్ కు లేదని ఆయన సెటైర్లు వేశారు. కేటీఆర్ కు రాహుల్ ను విమర్శించేంత స్థాయి లేదన్నారు. తండ్రీ, కొడుకులకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. కాంగ్రెస్ కు దేశ ప్రయోజనాలు ముఖ్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.