హైదరాబాద్‌లో రాత్రి దంచికొట్టిన వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం.. పలుచోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా

By Mahesh KFirst Published Jan 16, 2022, 4:56 AM IST
Highlights

హైదరాబాద్‌లో రాత్రి వర్షం దంచికొట్టింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు కుండపోతగా కురిసింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. ట్రాఫిఖ్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని చోట్లా వర్షం మూలంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. నాచారంలోనైతే.. కేవలం గంటన్నర వ్యవధిలోనే 11 సెంటిమీటర్ల వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. గురువారం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.
 

హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌(Hyderabad)లో రాత్రి(Night) వర్షం(Heavy Rains) దంచికొట్టింది. అర్ధరాత్రి సమయంలో కుండపోతగా కురిసింది. ఎల్‌బీ నగర్, ఉప్పల్, దిల్‌సుఖ్ నగర్, హబ్సిగూడ, తార్నాక, నాచారం, కాప్రా, మౌలాలి, మల్కాజ్‌గిరి పరిసర ప్రాంతాల్లో వర్షం కుమ్మేసింది. రాత్రి 10 గంటలకు వర్షం చిన్నగా కొట్టడం ప్రారంభమైంది. కానీ, కొద్ది సేపటికే ఉగ్రరూపం చూపించింద. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటి గంట వరకు వర్షం అదే ఉధృతి కొనసాగించింది. రాత్రి 10 గంటలకు వర్షం జల్లులుగా మొదలైనా.. 11 గంటల నుంచి 12.30 గంటల మధ్యలో దంచికొట్టింది. నాచారంలో కేవలం గంటన్నర వ్యవధిలోనే 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవడం గమనార్హం.

కుండపోతగా వర్షం కురవడంతో స్వల్ప కాలంలోనే రోడ్లపై నీరు వచ్చి చేరింది. ఈ వరద నీటితో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దిల్‌సుఖ్ నగర్ నుంచి మలక్‌పేట్ వరకు, హబ్సిగూడ నుంచి నాగోల్ వరకు ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్‌తోపాటు ఉమ్మడిద నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్, నార్కట్‌పల్లి ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. రాత్రి 1.30 గంటల ప్రాంతం నుంచి 3.30 గంటల వరకు నిరంతరాయంగా వర్షం కొట్టింది. ఆ తర్వాత కాస్త నెమ్మదించింది.

సంక్రాంతి పండుగ వేళ వర్షాలు కురవడంతో ప్రజలు అసౌకర్యాలకు గురవుతున్నారు. ట్రాఫిక్ సమస్య, విద్యుత్ సమస్యతో సంక్రాంతి వేడుకలపై ప్రభాావం పడుతున్నది. అకాల వర్షంపై రైతుల్లోనూ భయాందోళనలు ఉన్నాయి.

హైదరాబాద్‌లో గురువారం కూడా వర్షం దాటిగా కురిసింది. తెల్లవారు జాము నుంచే వర్షం కొట్టడం మొదలైంది. ఎల్‌బీ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్‌నగర్, కర్మాన్ ఘాట్, రాజేంద్ర నగర్, హైదర్ గూడ, నాగోల్, మీర్‌పేట్, అత్తాపూర్, నార్సింగి, మణికొండ ప్రాంతాల్లో వర్షం పడింది. కాగా, నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కోఠి, గోషామహల్, చాదర్‌ఘాట్, అంబర్‌పేట్, హిమాయత్ నగర్, రామంతాపూర్, చే నంబర్, గోల్నాక, ఉప్పల్, సైదాబాద్, మలక్‌పేట్, దిల్‌సుఖ్ నగర్‌లో భారీ వర్షం పడింది.

మంగళవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. వడగళ్ల వానలు కొన్ని ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గత 24 గంటల్లో సిద్దిపేట జిల్లా చిన్నకొడూరులో అత్యధికంగా 85.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు కరీంనగర్‌‌లోని శంకరపట్నంలో 60.8 మి.మీ, మానుకొండూరులో 56.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ  వర్షం కురిసింది. 

హైదరాబాద్‌లో కూడా మంగళవారం భారీ వర్షం కురిసింది. బొల్లారం, తిరుమలగిరి, కార్ఖానతో పాటు కుషాయిగూడ, సైనిక్‌పురి, మౌలాలి, చర్లపల్లి, బేగంపేట, చిలకగూడ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

click me!