
హైదరాబాద్‌లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం (hyderabad rain) కురవడంతో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (shamshabad international airport) విమానాలు దిగేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికే నాలుగు విమానాలను దారి మళ్లించారు. రెండు ఇండిగో విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించగా.. ఢిల్లీ, ముంబై నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు మళ్లించారు.
కాగా.. గత కొన్నిరోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతోన్న హైదరాబాద్ వాసులపై వాతావరణం కాస్త దయ చూపింది. గురువారం మధ్యాహ్నం నుంచి నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆ వెంటనే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని కొండాపూర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపరి, కొత్తపేట, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేట్, మలక్‌పేట ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అలాగే చాంద్రాయణగుట్ట, బార్కాస్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఈదురుగాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.