
హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయంగా కూడా తీవ్ర దుమారానికి దారితీస్తుంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. అత్యాచార ఘటనకు సంబంధించినవిగా పేర్కొన్న కొన్ని ఫొటోలు, వీడియోలను విడుదల చేయడం మరింత సంచలనంగా మారింది. అయితే రఘునందన్ రావు ఫొటోలు, వీడియోలు విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం 17 ఏళ్ల సామూహిక అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప్రజల్లోకి లాగిందని ఆరోపించింది. రఘునందన్ రావు వీడియో క్లిప్‌లను ఎలా పొందగలిగారో తెలుసుకోవాలని డిమాండ్ చేసింది.
ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసును నిర్వీర్యం చేసేందుకే రఘునందన్‌రావు వీడియో క్లిప్‌లను విడుదల చేశారని ఆరోపించారు. రఘనందన్ రావు మానవత్వపు విలువలను మరచిపోయారని విమర్శించారు. పోలీసులు, బీజేపీ మధ్య బంధం ఉందని ఆరోపించిన వెంకట్.. శుక్రవారం నుంచి పెద్ద రాజకీయ నాటకం నడుస్తోందని అన్నారు. తాము నిరసనకు పిలుపునిస్తే తమ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నప్పుడు.. బీజేపీ కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద ఘెరావ్ చేయడానికి పోలీసులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. డీజీపీని కలిసేందుకు బీజేపీ నేతలకు అనుమతి ఉంటుంది.. కానీ కాంగ్రెస్ నేతలకు మాత్రం అనుమతి లేదని అన్నారు.
రఘునందన్ రావు బయటపెట్టిన వీడియో రికార్డింగ్స్ కేవలం బాధితురాలిని కించపరిచే విధంగా, కేసుని తప్పుదోవా పట్టించే విధంగా ఉందని బల్మూరి వెంకట్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలిసి నిందితులని తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని అనిపిస్తుందన్నారు. రఘునందన్ రావు అత్యుత్సాహం చూస్తే అదే నిజమని అనిపిస్తుందన్నారు. ఎందుకీ వివక్ష?.. ఒక అమ్మాయికి న్యాయం చేయకపోగా తప్పుదారి పట్టించడం సిగ్గుచేటు అని విమర్శించారు.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా రఘునందన్ రావు ఫొటోలు, వీడియోలు విడుదల చేయడంపై ఫైర్ అయ్యారు. ‘‘అత్యాచారం కేసులో నిందితుల్లో ఒకరు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు. వీడియోను బహిర్గతం చేయడం ద్వారా రఘునందన్ ఈ కేసును, బాధితురాలి, ఆమె కుటుంబం భద్రత రెండింటినీ రాజీ చేశాడు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల మధ్య అపవిత్ర బంధమే అందుకు కారణమా?.. మైనర్ బాలికకు న్యాయం కంటే వారి బంధమే ముఖ్యమా?. అత్యాచార బాధితురాలి గుర్తింపును రక్షించాలన్నది ఇంగితజ్ఞానం. అలాగే సుప్రీం కోర్టు ఆదేశం. ఈరోజు అత్యాచార బాధితురాలి వీడియోను బీజేపీ ఎమ్మెల్యే, న్యాయవాది రఘునందన్ బయటపెట్టారు. రాజకీయాల కోసమా లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసమా?’’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
అంతేకాకుండా.. పోలీసులు లేదా నేరస్థుల వద్ద ఉన్న వీడియోను బీజేపీ ఎమ్మెల్యే ఎలా పొందారని మాణిక్కం ఠాగూర్ ప్రశ్నించారు. బాధితురాలి గుర్తింపు విషయంలో ఈ విధంగా వ్యవహరించినందుకు అతనిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వెస్ట్ డీసీపీ ఆయనను అరెస్ట్ చేస్తారా..? లేదంటే టీఆర్‌ఎస్+బీజేపీ+ఎంఐఎం బంధాన్ని నిరూపించుకునేందుకు నోరు మెదపరా.? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌పై రఘునందన్ రావు కౌంటర్ అటాక్..
అయితే కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై స్పందించిన రఘునందన్ రావు.. కాంగ్రెస్ ఎందుకు ఎప్పుడూ వారి సోదరులు ఎంఐఎం+టీఆర్ఎస్ కష్టాల్లో ఉన్నప్పుడు భయాందోళనలకు గురవుతుందని ప్రశ్నించారు. పోలీసుల అబద్ధాలను నిగ్గుతేల్చేందుకు ఆధారాలు బయటకు తీసుకురావాల్సి వచ్చిందన్నారు. హైదరాబాద్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు ప్రమేయంపై చర్య తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకే ఆధారాలు బయటకు తీసుకొచ్చినట్టుగా చెప్పారు. చూస్తుంటే మాణిక్కం ఠాగూర్, తెలంగాణ కాంగ్రెస్‌కు నిజయం బయటకు రావడం ఇష్టం లేనట్టు ఉందన్నారు. ఈ విధంగా ట్విట్టర్‌లో రఘునందన్ రావు, మాణిక్కం ఠాగూర్‌ల మధ్య మాటల యుద్దం నడించింది.