నగరవాసులకు శుభవార్త... మెట్రో రైలు మరో ముందడుగు

By telugu teamFirst Published Nov 22, 2019, 12:26 PM IST
Highlights

 హైటెక్‌ సిటీ నుంచి మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ ఈ నెల 29న దీన్ని ప్రారంభించనున్నారు. 

ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నడుస్తోంది. సమ్మె చేపట్టి నెల రోజులు దాటినా... ప్రజలు మరీ ఎక్కువగా ఇబ్బందులు పడింది లేదు. దీనికి కారణం అందుబాటులో మెట్రో సదుపాయం ఉండటంతో. మెట్రో అందుబాటులో ఉండటంతో దానిలోనే ప్రజలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. కాగా... మెట్రో తాజాగా నగరవాసులకు మరో శుభవార్త తెలియజేసింది.

హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశలో మరో ముందడుగు వేసింది.  ఐటీ ఉద్యోగులకు మరింత ఊరట కలిగించనుంది. హైటెక్‌ సిటీ నుంచి మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ ఈ నెల 29న దీన్ని ప్రారంభించనున్నారు. 

దీంతో కారిడార్‌-3లో నాగోల్‌ నుంచి మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ వరకు సుమారు 28 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి మెట్రో సేవలు ప్రారంభమైతే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుంది. 

ఇప్పటివరకు హైటెక్‌ సిటీ, రాయదుర్గం చెరువు మెట్రో స్టేషన్ల నుంచి షటిల్‌ సర్వీసుల ద్వారా కంపెనీలకు వచ్చే ఉద్యోగులు ఇక నుంచి ఐటీ కంపెనీలకు చాలా దగ్గరగా ఉన్న మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ వరకు రానున్నారు. మరోవైపు మెట్రో కారిడార్‌-2 నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు ఉన్న 10 కిలోమీటర్ల మార్గాన్ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

click me!