లక్షలు పలికే ‘‘9999’’ నంబర్‌ ... రూ.50 వేలకే, మేయర్ బొంతుపై విమర్శలు

By Siva KodatiFirst Published Feb 7, 2019, 2:05 PM IST
Highlights

ఎంతో ఇష్టపడి కొనుక్కునే కార్లకు..న్యూమరాలజీ ప్రకారమో లేదంటే క్రేజ్ కోసమో నెంబర్ ప్లేట్‌కు ఫ్యాన్సీ నెంబర్ కావాలని పలువురు ఎగబడుతుంటారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు.

ఎంతో ఇష్టపడి కొనుక్కునే కార్లకు..న్యూమరాలజీ ప్రకారమో లేదంటే క్రేజ్ కోసమో నెంబర్ ప్లేట్‌కు ఫ్యాన్సీ నెంబర్ కావాలని పలువురు ఎగబడుతుంటారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు.

అలాంటి వాటిలో ఒకటి ‘‘9999’’ అనే ఫ్యాన్సీ నంబర్. ఈ నెంబర్ కోసం లక్షలు ఖర్చుపెట్టేందుకు సైతం పలువురు వెనుకాడరు. కానీ ఇంతటి అరుదైన నెంబర్‌ను హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాత్రం కేవలం రూ.50 వేల ధరకే దక్కించుకోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయం ‘‘టీఎస్ 09 ఎఫ్‌డీ 9999’’ సిరీస్‌ను నెంబర్‌ను వేలానికి ఉంచింది. దీని రిజర్వ్ ధరను రూ.50 వేలుగా నిర్ణయించారు. ఇలాంటి అరుదైన నెంబర్ కోసం చాలామంది పోటీపడతారు.

కానీ మేయర్ ఒక్కరే దీనికి దరఖాస్తు చేసుకున్నారని, పోటీకి ఇతరులెవరు రాకపోవడంతో రిజర్వ్ ధర రూ.50 వేలుకు బొంతుకే అప్పగించారు.  అయితే ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది హైదరాబాద్ అయ్యింది. మేయర్ అనుచరులతో పాటు అధికారుల ఒత్తిడి కారణంగానే ఈ నెంబర్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని చర్చ జరుగుతోంది.

కాగా, గతంలో ఆర్టీఏ అధికారులు ఇదే నెంబర్ కోసం వేలం పాట నిర్వహించగా... రూ.7 లక్షల నుంచి రూ. 11 వరకూ ధర పలికింది. కేరళకు చెందిన ఓ సంపన్నుడు ‘‘9999’’ నెంబర్ కోసం రూ.31 లక్షలు వెచ్చించాడు. మరోవైపు తాజాగా హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలం పాటలో ఒక్క రోజులో రూ.14.59 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
 

click me!