
హైదరాబాద్: కొడుకు పుట్టినరోజును అంగరంగవైభవంగా నిర్వహించాలని భావించిన ఓ తండ్రి కటకటాలపాలైన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. కొడుకు పుట్టినరోజు వేడుకకు వచ్చినవారిని ఎంటర్టైన్ చేసేందుకు అమ్మాయిలతో నృత్యాలు ఏర్పాటుచేసాడో వ్యక్తి. అయితే చట్టవిరుద్దంగా అమ్మాయిలతో అసభ్య నృత్యాలు చేయించినట్లు తెలుసుకున్న పోలీసులు నిర్వహకుడితో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే... పాతబస్తీ రెయిన్ బజార్ లోని ముంజుమియా తబేళా ప్రాంతానికి చెందిన ఆరిఫ్ కుమారుడి పుట్టినరోజు వేడుక గత మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా భర్త్ డే పార్టీకి వచ్చినవారి కోసం రాత్రి ఇంటి ఎదుట యువతులతో నృత్యాలు చేయించాడు. కాస్త అసభ్యంగా సాగిన ఈ డ్యాన్స్ పోగ్రామ్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది.
రెయిన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమ్మాయిలతో డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగినట్లు నిర్దారించిన పోలీసులు సిటీ పోలీస్ యాక్ట్ కింద ఐదుగురిపై, ఆర్మ్ యాక్ట్ కింద మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కోర్ట్ ఆదేశాలతో వారిని రిమాండ్ కు తరలించారు.
ఇదిలావుంటే హైదరాబాద్ లో ఇటీవల కాలంలో ఇలా అశ్లీలతే పెట్టుబడిగా యువతను తప్పుడుదారిలోకి లాగుతున్న పబ్ లపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. పబ్ కల్చర్ అంటూ కలరింగ్ ఇస్తూ అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఇటీవల బంజారాహిల్స్ రాడిసన్ హోటల్లోని పుడ్డింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దొరకడంతో తీవ్ర దుమారం రేగింది.
అలాగే సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని టెకిలా పబ్ వ్యవహారం బయటపడింది. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహిస్తున్నట్లుగా ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ పబ్‌పై దాడి చేశారు. పోలీసులు దాడులు చేసిన సమయంలో పబ్‌లో యువతులు అశ్లీల నృత్యాలు గుర్తించారు. యువతులతో అశ్లీల నృత్యాలు, లేట్ నైట్ న్యూసెన్స్ నేపథ్యంలో పోలీసులు 18 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 8 మంది డ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్ ఉన్నారు.
ఇదే సికింద్రాబాద్ లోని బసేరా హోటల్లో నడుస్తున్న ఓ పబ్ పై అనుమానం రావడంతో స్థానిక గోపాలపురం పోలీసులు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆ పబ్ పై నిఘా పెట్టారు. దీంతో పబ్ లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నట్లు గుర్తించిన టాస్క్ ఫోర్స్ బృందం ఒక్కసారిగా దాడిచేసి యువతులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
పబ్ నిర్వహకులు యువకులను ఆకట్టుకునేందుకు ఇలా యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పబ్ కు వచ్చే యువకుల నుండి అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారట. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సదరు పబ్ పై టాస్క్ ఫోర్స్ దాడులు జరిగాయి. మహిళా పోలీసుల సాయంతో పదిమంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.