హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికలో కాంగ్రెసు అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెసు నాయకత్వం కొండా సురేఖ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల బరిలోకి కాంగ్రెసు నాయకురాలు కొండా సురేఖ దిగడం దాదాపుగా ఖాయమైందని అంటున్నారు. కొండా సురేఖ పేరను కాంగ్రెసు అధిష్టానం ఖాయం చేసినట్లు సమాచారం. బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీకి దిగుతున్నారు. వారిద్దరు కూడా బీసీ నాయకులు. ఈ స్థితిలో కాంగ్రెసు కూడా బీసీ నేతనే పోటీకి దించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
త్వరలో కొండా సురేఖ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ కార్యవర్గం శనివారంనాడు సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించింది. కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణా రెడ్డి, ప్యాట రమేష్ పేర్లను పీసీసీ పరిశీలించినట్లు తెలుస్తోంది. చివరకు సురేఖ పేరును తెలంగాణ పీసీసీ ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
undefined
బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, గెల్లు శ్రీనివాస యాదవ్ యాదన సామాజిక వర్గానికి చెందినవారు. ఈ స్థితిలో కొండా సురేఖను పోటీకి దించడమే మంచిందని కాంగ్రెసు నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. సురేఖ పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు కాగా, మురళి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో హుజరాబాద్ నియోజకవర్గంలో కొండా సురేఖను నిలబెడితే ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెసు నాయకత్వం భావిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెసు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెసు ఏ విధంగానూ మెరుగైన ఫలితాలు సాధించలేదు. సిట్టింగ్ స్థానాలను కూడా కోల్పోయింది. ఉప ఎన్నికలు కూడా కాంగ్రెసు పార్టీకి కలిసి రాలేదు. ఆ వైఫల్యాలన్నీ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదుగా వెళ్లిపోయాయి.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత పార్టీకి జవజీవాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త పీసీసీ జట్టు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.