రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఖరేమిటి?.. కాంగ్రెస్ స్టాండ్ తీసుకున్నాకే నిర్ణయం..!

Published : May 11, 2022, 10:03 AM IST
రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఖరేమిటి?.. కాంగ్రెస్ స్టాండ్ తీసుకున్నాకే నిర్ణయం..!

సారాంశం

ఈ ఏడాది జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

ఈ ఏడాది జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుండటంతో.. మరికొద్ది వారాల్లోనే రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలకు మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్.. ప్రస్తుతం బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. రాష్ట్ర బీజేపీ నేతలు టీఆర్ఎస్ పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు. 

ఇక, కొంతకాలంగా కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ  కూటమి ప్రయత్నాలు కూడా చేశారు. వరుసగా తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్‌లకు వెళ్లి అక్కడి నేతలతో జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి ఎలక్టోరల్ కాలేజ్‌లో కాంగ్రెస్‌కు బలం చాలా తక్కువగా ఉంది. కాంగ్రెస్ కన్నా కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలకే ఓట్ల విలువ ఎక్కువగా ఉన్నది. 

ఈ క్రమంలోనే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు నిలబెట్టిన అభ్యర్థికి కేసీఆర్ మద్దతిస్తారా..? లేక ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టడంలో ఇతర పార్టీలతో కలిసి కీలకంగా వ్యవహరిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. 

అయితే టీఆర్ఎస్ వర్గాల ప్రకారం.. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ మే 13 నుంచి 15 వరు ఉదయ్‌పూర్‌లో జరగనున్న కాంగ్రెస్ చింతన్ శివిర్‌ నిర్ణయాలను పరిశీలించిన తర్వాతే కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వ్యుహరచన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థి  నిలబెట్టడంపై కాంగ్రెస్ తీసుకునే వైఖరి, బీజేపీయేతర పార్టీలు ఎలా స్పందిస్తాయనే స్పష్టత కోసం గులాబీ బాస్ వెయిట్ చేస్తున్నట్టుగా సమాచారం. 

మరోవైపు త్వరలో ఖాళీ అవుతున్న పలు రాజ్యసభ స్థానాలకు జూన్‌లోగా ఎన్నికలు పూర్తి చేయనున్నారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత ఎన్డీఏకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జాతీయ రాజకీయల్లో తన తదుపరి ఎత్తుగడలను వేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 

తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు..
రాష్ట్రపతి ఎన్నికలకు ముందే తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత వారం ఎన్నికల సంఘం తెలంగాణలోని ఒక రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేయగా.. మిగిలిన రెండు స్థానాలకు సంబంధించి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే 
అసెంబ్లీలో తనకున్న బలాన్ని దృష్టిలో ఉంచుకుని.. మూడు స్థానాలను ఏకగ్రీవంగా టీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు సిద్దమైంది. రాజ్యసభ స్థానాలకు సంబంధించి గులాబీ బాస్ కేసీఆర్.. రానున్న 10 రోజుల్లోపే అభ్యర్థులను ప్రకటించనున్నారు.  

ఇక, ఇటీవలి కాలంలో పలు ప్రాంతీయ  పార్టీలతో చర్చలు జరిపిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలతో పాటుగా, రాష్ట్రపతి ఎన్నికల ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి నిలబెట్టడంపై కూడా చర్చలు జరిపారని సమాచారం. అయితే కాంగ్రెస్ విషయంలోనే ప్రాంతీయ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌తో మిత్రపక్షంగా ఉన్న డీఎంకే, శివసేన, ఎన్సీపీ.. పార్టీలు మాత్రం కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగేందుకు అనుకూలంగా ఉన్నాయి.  

కేసీఆర్ విషయానికి వస్తే తెలంగాణలో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్‌ను గద్దె దింపుతామని ప్రతినబూనారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునేదే లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్.. కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో గులాబీ పార్టీ వైఖరిని ఖరారు చేసేముందు కేసీఆర్.. ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో కూడా మంతనాలు సాగించే అవకాశం ఉంది.

ఇక, మరోవైపు ఎన్డీఏ కూటమికి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ మద్దతిస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ రెండు ప్రాంతీయ పార్టీలో లోక్‌సభ, రాజ్యసభలతో పాటు.. వారి రాష్ట్రాల శాసనసభలలో కూడా గణనీయమై బలం ఉంది. ఈ రెండు పార్టీ మద్దతుతో.. ఎన్టీయే కూటమి సులువుగా రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందని కూడా కేసీఆర్ అంచనా వేశారు.

ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉండాలా..?, కాంగ్రెస్‌ను మినహాయించి బీజేపీయేతర పార్టీల కూటమిలో భాగంగా ఉండాలా..? అనే విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?