టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో తెల్దారుపల్లిలో హైటెన్షన్.. 144 సెక్షన్ విధించిన పోలీసులు

By Sumanth KanukulaFirst Published Aug 15, 2022, 3:08 PM IST
Highlights

ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేయడంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేయడంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కృష్ణయ్య హత్యపై ఆయన అనుచరులు భగ్గుమన్నారు. ఆగ్రహంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్‌‌ను ధ్వంసం చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. తెల్దారుపల్లిలో సీపీఎం దిమ్మెలను కృష్ణయ్య అనుచరులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

దీంతో గ్రామంలో ఎప్పుడూ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే తెల్దారుపల్లిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.

సోమవారం ఉదయం కృష్ణయ్యను కొందరు వ్యక్తులు హత్య చేశారు. ఆయనను వెంబడించి.. వేట కొడవళ్లతో కిరాతకంగా నరికి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. 

కృష్ణయ్య హత్య తమ్మినేని కుటుంబంలో విబేధాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణయ్య.. తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు (బాబాయ్ కొడుకు) అవుతారు. అయితే సీపీఎంతో విభేదించిన కృష్ణయ్య.. కొన్నేళ్ల కిందట టీఆర్ఎస్‌లో చేరారు. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృష్ణయ్య అనుచరుడిగా ఉన్నారు. అయితే ఈ హత్య వెనక కోటేశ్వరరావు(తమ్మినేని వీరభద్రం సోదరుడు) ఉన్నారని కృష్ణయ్య అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

click me!