ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు బోయినపల్లి అభిషేక్ రావు,విజయ్ నాయర్ ల బెయిల్ పిటిషన్లపై విచారణను ఈనెల14కి వాయిదావేసింది సీబీఐ కోర్టు
న్యూఢిలీ:ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు బోయినపల్లి అభిషేక్ రావు,విజయ్ నాయర్ ల బెయిల్ పిటిషన్లపై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.ఈ కేసులో సీబీఐకి అఫ్రూవర్ గా మారిన దినేష్ అరోరా స్టేట్ మెంట్ విన్న తర్వాత బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోనున్నట్టుగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ వెల్లడించింది. సోమవారంనాడు సాయంత్రం 4 గంటలకు బెయిల్ పిటిషన్ పై ఉత్తర్వులు ఇవ్వనుంది సీబీఐ ప్రత్యేక కోర్టు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులుగా ఉన్న బోయినపల్లి అభిషేక్ రావు,విజయ్ నాయర్ లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇవాళ సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించింది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ కొనసాగుతున్నందున నిందితులకు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు.ఈ పరిస్థితుల్లో నిందితులకు బెయిలిస్తే ఇబ్బందులు వస్తాయని సీబీఐ వాదించింది. లిక్కర్ పాలసీలో భాగంగా మద్యం దుకాణాల కేటాయింపు,టెండర్ల సమయంలోనే పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. అంతేకాదు ఇదే సమయంలో మనీలాండరింగ్ జరిగిందని సీబీఐ కోర్టులో వాదనలను విన్పించింది. ఇదిలా ఉంటే ఈ కేసుతో అభిషేక్ రావుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ధినేష్ అరోరా స్టేట్ మెంట్ ఇచ్చే కీలక సమయంలో నిందితులకు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ వాదించింది. ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు ఈ నెల 14వ తేదీకి బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదావేసింది.సోమవారంనాడు దినేష్ అరోరా స్టేట్ మెంట్ విన్న తర్వాత బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకొంటామని కోర్టు తెలిపింది.