
తెలంగాణ బీజేపీ ‘‘మా నౌకరీలు మాగ్గావాలె’’ అనే నినాదంతో మార్చి 25న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే హైకోర్టు పలు షరతులను విధించింది. 500 మందితో ధర్నా నిర్వహించుకోవాలని ఆదేశించింది. అయితే ధర్నాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ నేతలకు హైకోర్టు సూచించింది. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే జాతీయ నేతలు, మంత్రులు ఎవరు వస్తున్నారో తెలుపాలని బీజేపీకి సూచించింది. రాత్రి 9 గంటలోపు వివరాలు పోలీసులకు తెలుపాలని సూచించింది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువతకు మద్దతుగా బీజేపీ పెద్దఎత్తున నిరసన చేపట్టేందుకు సిద్దమైంది. మార్చి 25న ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్‌లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసిన ఉద్యోగ ఆశావహులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
అయితే ఇందిరాపార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించింది. ధర్నాకు అనుమతి ఇచ్చేలా పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బీజేపీ మహా ధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.