సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం... మానేరు వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసి బస్సు (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 31, 2021, 10:09 AM IST
Highlights

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు వాగులో కొట్టుకుపోయిన ఘటన మరువకముందే సిరిసిల్ల జిల్లాలో ఓ ఆర్టీసి బస్సు కూడా వరద నీటిలో కొట్టుకుపోయింది.  

సిరిసిల్ల: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలన్ని నిండుకుండల్లా మారాయి. అంతేకాదు వాగులు, వంకలు వరదనీటితో ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి వచ్చిన ఈ నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నిస్తూ చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వాగును దాటేందుకు ప్రయాణిస్తూ 29మంది ప్రయాణికులతో కూడిన ఆర్టీసి బస్సు వాగులో చిక్కుకుంది. 

వివరాల్లోకి వెళితే... గత ఆదివారం నుండి తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలా సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే సోమవారం కామారెడ్డి నుండి సిద్దిపేట వెళుతున్న ఆర్టీసి బస్సు గంభీరావుపేట-లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగులో చిక్కుకుంది. 

read more  తెలంగాణలో భారీ వర్షాలు : వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి

రోడ్డుపైకి చేరుకున్న వరద నీటిని దాటే ప్రయత్నంలో బస్సు అందులో చిక్కుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బస్సు వద్దకు చేరుకుని 29మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ ను సురక్షితంగా కాపాడారు. అయితే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వాగులో చిక్కుకున్న బస్సును కూడా బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాగులో నీటి ప్రవాహం పెరగడంతో ఇవాళ(మంగళవారం) ఉదయం బస్సు కొట్టుకుపోయింది. 

వీడియో

భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరిస్తున్నారు. మరో రెండురోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.  

click me!