
తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. వారం రోజుల క్రితం అకాల వర్షాలతో వాతావరణం చల్లగా అనిపించిన.. ఇప్పుడు భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌తో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వేడి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకా తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలో వేడిగాలులు వీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. రానున్న ఏడు రోజుల్లో హైదరాబాద్‌లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఆదివారం వరకు హైదరాబాద్ నగరంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తేమ శాతం పెరగడం వల్ల రాత్రులు కూడా అసౌకర్యంగా మారే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇక, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ములుగు, కుమురం భీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, తదితర 15 జిల్లాలకు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.