రాజకీయాల్లోకి బండారు దత్తాత్రేయ కుమార్తె.. టికెట్ కోసం దరఖాస్తు, ఎక్కడి నుంచి అంటే..?

By Siva KodatiFirst Published Sep 10, 2023, 3:35 PM IST
Highlights

బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ , బీజేపీలు ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ పని పూర్తి చేయగా.. కాషాయ దళంలో మాత్రం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలావుండగా.. బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులతో కలిసి విజయలక్ష్మీ ఇవాళ టికెట్ కోసం దరఖాస్తును సమర్పించారు. 

ఈ సందర్భంగా విజయలక్ష్మీ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నుంచి పోటీ చేయడం ఆనందంగా వుందన్నారు. కాగా.. బండారు దత్తాత్రేయకు తెలుగు రాజకీయాల్లో మంచి పేరే వుంది. అన్ని పార్టీల నేతలతో ఆయనకు సత్సంబంధాలు వున్నాయి. ప్రస్తుతం అలయ్ బలయ్ ఫౌండర్ ఛైర్‌పర్సన్‌గా విజయలక్ష్మీ వ్యవహరిస్తున్నారు.

ALso Read: ఆ గవర్నర్ కూతురికి బిజెపి ఎమ్మెల్యే టికెట్?... ముషీరాబాద్ లో పోటీపై బండారు విజయలక్ష్మి క్లారిటీ

గతేడాది అలయ్ బలయ్ సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. అలాగే బీజేపీ కార్యక్రమాల్లోనూ విజయలక్ష్మీ చురుగ్గా పాల్గొంటున్నారు. బండి సంజయ్ పాదయాత్ర సమయంలోనూ ఆమె కీలకపాత్ర పోషించారు. సనత్ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి విజయలక్ష్మీ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ నిర్ణయం ఎలా వున్నా దానికి కట్టుబడి పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. 

click me!