కేసిఆర్ కల సాకారమైంది... నా జన్మ ధన్యమైంది

First Published Oct 4, 2017, 3:27 PM IST
Highlights
  • సిద్ధిపేట గ్రామాలకు నీటిని విడుదల చేసిన హరీష్ రావు
  • నా జన్మ ధన్యమైందని ప్రసంగం

గోదావరి నీళ్లు సిద్దిపేటను ముద్దాడాయి.. కేసిఆర్ లక్ష్యం, సిద్దిపేట ప్రజల కల సాకారమైంది.. నా జన్మ ధన్యమైంది అని ఉద్వేగంగా అన్నారు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. ఇంతటి అదృష్టాన్ని నాకు కల్పించిన సిఎం కేసిఆర్ కు కృతజ్ఞతలు...  ఇది చారిత్రాత్మక దినం...కొండపాక మండల ప్రజలకు శుభదినం.. అని పేర్కొన్నారు హరీష్.

గోదావరి నీళ్లను గంగారం దగ్గర నుంచి 540 మీ. ఎత్తున గల మన ప్రాంతానికి తీసుకువచ్చాం.  187 కి.మీ.లు మన ప్రాంతం ఎత్తులో ఉంది గనుక మల్లన్న సాగర్ పూర్తి అయితే పక్క జిల్లాలు కూడా సశ్యశ్యామలం అవుతాయి. 82542 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది అన్నారు. సాగునీటి కష్టాలు తీర్చగేందుకే తపాస్ పల్లి రిజర్వాయర్ చేపట్టామని,  73 గ్రామాలకు గోదావరి జలాలు అందుతాయని అన్నారు హరీష్ రావు.

ఈ నీటితో వర్షాలపైనే ఆధారపడిన సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొండపాక, కొమురవెళ్ళి, మద్దూర్, సిద్ధిపేట మండలాలతో పాటు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని సాగునీటి ప్రజల కష్టాలు ఇక తీరాయి. సిద్ధిపేట జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన 59 గ్రామాలతో పాటు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని 14 గ్రామాలు మొత్తం 73 గ్రామాలకు గోదావరి జలాలను కాలువ ద్వారా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు తపాస్ పల్లి రిజర్వాయర్‌ ఎడమ కాలువ డి4 ద్వారా నీటిని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం ఉదయం విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తరెడ్డి యాదిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, వివిధ శాఖల అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/znyV3h

click me!