గాంధీలో కరోనా పాజిటివ్ మహిళ ప్రసవం: హరీష్ రావు ట్వీట్, ఈటెల రియాక్షన్

By telugu teamFirst Published May 9, 2020, 7:55 AM IST
Highlights

సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులు ఓ కరోనా పాజిటివ్ మహిళకు ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. దానిపై హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. హరీష్ రావుకు ఈటెల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న కరోనా సోకిన గర్భిణి మగ బిడ్డ కు జన్మ నిచ్చిన విషయం విదితమే. ప్రత్యేక జాగ్రత్తలతో గర్భిణి కి గైనిక్‌ విభాగం వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. కాగా ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమం గానే ఉన్నారని వైద్యులు తెలిపారు. 

ఈ ఘటనపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. వైద్యులపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతే కాదు.. ఈ చికిత్స చేసిన వైద్యులను ‘కనిపించే దైవాలు’ అని మంత్రి సంబోధించారు. ‘కరోనా సోకిన నిండు చూలాలి లో ధైర్యం నింపి ప్రత్యేక జాగ్రత్తలతో ప్రసవం చేసి తల్లి బిడ్డలకు పునర్జన్మ ప్రసాదించిన మన గాంధీ హాస్పిటల్ వైద్యులు దేశాని కే ఆదర్శంగా నిలిచారు. ఆ కనిపించే దైవాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా.. ఇంటికి చేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు’ అని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ పై పలువురు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ లైక్ చేసి.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: గాంధీ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ

కాగా.. హరీష్ ట్వీట్‌ పై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ట్విట్టర్ వేదిక గా రియాక్ట్ అయ్యారు. ‘మీ అభినందనలకు ధన్యవాదములు.. మీ శుభాకాంక్షలు మరింత ఉత్సాహంతో పని చేయడానికి దోహద పడతాయి’ అని ఈటల ట్వీట్ చేశారు. కరోనా తో చికిత్స తీసుకుంటున్న గర్భిణి కి ఇవాళ పురిటి నొప్పులు రావడంతో ఆమెకు వైద్యులు డెలివరీ చేశారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. 

అయితే.. సదరు మహిళ కుటుంబం లో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వారందరూ గాంధీ ఆస్పత్రి లోనే చికిత్స పొందుతున్నారు. బిడ్డకు కరోనా సోకిందా..? లేదా..? అనేది ఇంకా తెలియ రాలేదు.

click me!