తెలంగాణలో గత 24 గంటల్లో పది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగామని చెప్పారు.
హైదరాబాద్: గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,132కు చేరుకుందని ఈ విషయాలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం తెలంగాణలోని మరో 14 జిల్లాలో గ్రీన్ జోన్ల పరిధిలోకి వెళ్లాయని ఆయన చెప్పారు. ఇప్పటికే 9 జిల్లాలు గ్రీన్ జోన్ల పరిధిలో ఉన్నాయని ఆయన చెప్పారు.
హైదరాబాదు, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలు మాత్రమే రెడ్ జోన్లుగా ఉన్నాయని ఆయన చెప్పారు. కరోనా వైరస్ ను సమర్థంగా కట్టడి చేయగలిగామని ఆయన చెప్పారు. కరోనా పరీక్షలు చేయడం లేదనే ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
undefined
75 ఏళ్ల వృద్ధులు కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అవుతున్నారని, గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చిందని, మన వైద్యుల ప్రతిభకు ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. కంటైన్మెంట్ జోన్లలో కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
హైదరాబాదు పాతబస్తీలో వస్తున్న కేసులపై తాము దృష్టి సారించామని రాజేందర్ చెప్పారు. గ్రీన్ జోన్లలో కేంద్రం అనుమతి ఇచ్చిన కార్యక్రమాలన్నీ సాగుతాయని ఆయన చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ఇళ్లలో నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా చూస్తున్నట్లు ఆయన తెలిపారు.ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారికి సరిహద్దుల్లోనే పరీక్షలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.