వృద్ధురాలికి ఇల్లు.. ఎస్సైకి గవర్నర్ అభినందనలు..!

By telugu news teamFirst Published Jan 7, 2021, 11:13 AM IST
Highlights

సదరు ఎస్సైని తన వద్దకు పిలుపించుకొని మరీ అభినందించారు. వృద్ధురాలి ఇంటి నిర్మాణం కోసం ఎస్సై వెచ్చించిన మొత్తాన్ని చెక్కు రూపంలో తిరిగి ఆయనకు ఇచ్చేశారు.

ఉండటానికి కనీసం ఇల్లులేక ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధురాలికి పాలకుర్తి ఎస్సై సతీష్ చేయూతనందించాడు. ఆమెకు డబ్బు ఇచ్చి.. ఇల్లు కట్టుకునేందుకు సహకరించాడు. ఆయన సేవాగుణం తెలుసుకున్న గవర్నర్ సౌందర్య రాజన్ వెంటనే స్పందించారు. సదరు ఎస్సైని తన వద్దకు పిలుపించుకొని మరీ అభినందించారు. వృద్ధురాలి ఇంటి నిర్మాణం కోసం ఎస్సై వెచ్చించిన మొత్తాన్ని చెక్కు రూపంలో తిరిగి ఆయనకు ఇచ్చేశారు.

అనంతరం సదరు వృద్ధురాలి కష్టాలు తెలుసుకుని రాజ్‌భవన్‌కు ఆహ్వానించి భోజనం పెట్టి, నిత్యావసరాలను, రూ. 50 వేలను అందజేశారు. జనగాం జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన రాజమ్మ(75)కు భర్త చనిపోయాడు. కుమారుడు దివ్యాంగుడు. చేదోడు వాదోడుగా ఉన్న కోడలు అనారోగ్యంతో మృతి చెందింది. చిన్న గుడిసెలో కొడుకు, మనవరాలితో ఉంటూ కూలీ పనులకు వెళుతూ వచ్చిన ఆ పైసలతో వారిని పోషించుకుంటోంది. కొద్ది రోజుల క్రితం పాముకాటుతో మనవరాలు చనిపోయింది.

గత ఆగస్టులో  వర్షాలకు గుడిసె కూలిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్సై సతీశ్‌ గుడిసె స్థానంలో చిన్నపాటి ఇల్లు కట్టించాలని నిర్ణయించారు. ఒక గదితో కూడిన రేకుల ఇంటి నిర్మాణానికి రూ.1.6 లక్షలు ఖర్చయ్యా యి. ఇందులో రూ. 80 వేలు ఆయన సొంతంగా చెల్లించారు. మిగతా మొత్తాన్ని గ్రామస్థులు అందించారు. డిసెంబరు 31న కొత్త ఇంట్లోకి రాజమ్మ గృహప్రవేశం చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గవర్నర్‌ బుధవారం రాజమ్మను, ఎస్సై సతీశ్‌ను రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. 

రాజమ్మ మనుమరాలు పాముకాటుతో చనిపోయిందని తెలుసుకొని చలించిపోయారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీల్లో పాముకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. రాజవ్వ, ఆమె కుమారుడు సంతోషంగా ఉండేలా చూడాలని జిల్లా యంత్రాంగానికి, రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖకు ఆదేశాలిచ్చారు. రాజమ్మకు నిత్యావసర సరుకులు, రూ.50వేల సాయం అందించారు. ఆమె ఇంటి నిర్మాణం కోసం ఎస్సై సతీశ్‌ ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఆయనకు అందేశారు. 
 

click me!