
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ (Pragati Bhavan) వద్ద శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీవో 317ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు.. నేడు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించాయి. government teachers ఒక్కసారిగా ప్రగతి భవన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీచర్స్.. దశల వారీగా ప్రగతి భవన్ ముట్టడికి వస్తుండటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పంజాగుట్ట నుంచి ప్రగతి భవన్ వరకు పోలీసులు మోహరించారు.
ఇప్పటివరకు 70 మందికి పైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వచ్చినవారిని వచ్చినట్టుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. అసంబద్దంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టారని, సీనియార్టీ ప్రకారం కేటాయింపు జరగలేదని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ దంపతులకు ఒకేచోట పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీచర్లు ఆరోపిస్తున్నారు. 317 జీవో రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని వెల్లడించారు.
టీచర్ల అరెస్ట్‌ను ఖండించిన బండి సంజయ్..
ప్రగతి భవన్ వద్ద టీచర్ల అరెస్ట్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. జీవో 317 ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థానికతకు గొడలిపెట్టు అని అన్నారు. జీవో 317ను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన టీచర్లను బేషరతుగా విడుదల చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. 317 జీవోను సవరించేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు.
ఇక, రెండు రోజుల క్రితం కూడా జీవో 317ను రద్దు చేయాలని డిమాండ్‌తో టీచర్స్ ప్రగతిభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. తాము సీఎం కేసీఆర్‌ను కలిసి సమస్యను వివరిస్తామని.. అందుకు అనుమతి ఇవ్వాలని ప్రగతి భవన్ భద్రతా సిబ్బందిని టీచర్స్ కోరారు. అయితే అందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో.. టీచర్స్ ప్రగతి భవన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు 47 మంది టీచర్లను అరెస్టు చేసి నగరంలోని వివిధం పోలీసు స్టేషన్‌లకు తరలించారు.
ఉద్యోగుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317 (317 GO) వివాదం రోజు రోజుకు ముదురుతోంది. గత కొన్ని రోజులుగా ఈ జీవోపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు ఈ అంశంపై ఆందోళనలు చేస్తున్నాయి. ఈ జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక రకంగా నిరసలు తెలుపుతూనే ఉన్నారు. అయితే ఈ సంక్రాంతి పండగ సందర్భాన్ని ఉపయోగించుకొని కూడా తెలంగాణ సర్కార్ తీరును ముగ్గుల ద్వారా ఉద్యోగులు నిరసిస్తున్నారు.