భద్రాచలం వద్ద గోదావరి 54.7 అడుగులకు చేరింది. నిన్నటితో పోలిస్తే గోదావరికి వరద తగ్గింది. అయితే మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి 54.7 అడుగులకు చేరింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ గోదావరికి వరద కొంచెం తగ్గింది.మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఎగువ నుండి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరికి వరద తగ్గు ముఖం పట్టింది. శనివారం నాడు రాత్రి 56.9 అడుగుల మేర గోదావరి చేరుకుంది. అయితే ఇవాళ మధ్యాహ్ననికి గోదావరికి వరద కొంచెం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. అయితే మళ్లీ వర్షాలు వస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
భద్రాచలం ఆలయం వద్ద స్నానఘట్టం ఇంకా వరద నీటిలోనే ఉంది. గోదావరితో పాటు ఇతర నదుల వరద పోటెత్తడంతో రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో దుమ్ముగూడెం,చర్ల,వాజేడు, వెంకటాపురం తదితర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వద్ద 46 అడుగుల ఎత్తులో శబరి నది ప్రవహిస్తుంది. దీంతో కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని పలు గిరిజన గ్రామాలు నీట మునిగాయి.
మరో వైపు గోదావరి వరద ప్రవాహంతో భద్రాచలం పట్టణంలోని కొన్ని కాలనీల్లో వరద ముంచెత్తింది. వరద బాధిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం పట్టణంలో ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాచలం నుండి దిగువకు గోదావరి ఉరకలెత్తుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో లంక గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ధవళేశ్వరం నుండి 14 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నీరంతా పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల మీదుగా సముద్రంలోకి ప్రవహిస్తుంది. గోదావరి నదికి వరద పోటెత్తిన కారణంగా అధికారులు లంక గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.