గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం

By Pratap Reddy Kasula  |  First Published Feb 15, 2023, 7:29 AM IST

గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ బయలుదేరి గోదావరి ఎక్స్ ప్రెస్ ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో పట్టాలు తప్పింది. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.


హైదరాబాద్: గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం తెల్లవారు జామున ఐదున్నర గంటల సమయంలో గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ఆ సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. 

రైలు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ బయలుదేరింది. హైదరాబాద్ కు కొద్ది సేపట్లో చేరుకోనుండగా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్ సి నగర్ సమీపంలో బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులకు ఏ విధమైన ప్రమాదం జరగలేదు. కానీ, కొంత మంది రైలు నుంచి కిందికి దూకేయడంతో గాయపడ్డారు.

Latest Videos

రైలు వేగం తక్కువగా ఉండడంతో ప్రాణహానీ జరగలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో కాజీపేట - సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు తప్పిన బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ పని పూర్తి కావడానికి బుధవారం మధ్యాహ్నం కావచ్చునని అంచనా వేస్తున్నారు. రైల్వై అధికారులు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు.ప్రమాదం విచారణ చేపట్టారు.

ఐదు బోగీలను వదిలేసి గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాదుకు బయలుదేరింది. పట్టాలు తప్పిన ఐదు కోచ్ లు కూడా కొత్తవి. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

click me!