తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఈ మేరకు గురువారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించింది. అలాగే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను సైతం ఏర్పాటు చేసింది.
హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం జీహెచ్ఎంసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. భారీ వర్షాలపై హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్ఎంసీ.. 24 గంటలూ అధికారులు అందుబాటులో వుండాలని ఆదేశించింది. అలాగే జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూం సైతం ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్ధితుల్లో 040-21111111, 29555500 నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు కోరారు.
ఇకపోతే... Musi నదికి వరద తగ్గింది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద కూడా వరద తగ్గింది. అయితే మూసారాంబాగ్ బ్రిడ్జిపై బురద, చెత్త పేరుకుపోయింది. అంతేకాకుండా బ్రిడ్జి రెయిలింగ్, పుట్ పాత్ కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జిపై వరద నీటిలో కొట్టుకు వచ్చిన బురద, చెత్తను, జీహెచ్ఎంసీ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు.
undefined
Also REad:చేపల వేటకెళ్లి.. వాగులో ఇరుక్కుని, చెట్టుపై ఎదురుచూపులు.. ముగ్గురిని రక్షించిన రెస్క్యూ టీమ్
సోమవారం నాడు రాత్రితో పాటు మంగళవారం నాడు కురిసిన వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు సాయంత్రం నుండి వర్షం తగ్గుముఖం పట్టింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మూసీ నదికి వరద పోటెత్తింది. 100 ఏళ్ళలో ఏనాడూ రాని వరదలు మూసీకి ఈ దఫా వచ్చాయి. ఇదిలా ఉంటే హైద్రాబాద్ నగరానికి మంచినీటిని అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేయడంతో మూసీకి వరద పెరిగింది. అయితే ఈ రెండు జంట జలాశయాలకు వరద తగ్గడంతో మూసీకి కూడా వరద తగ్గిందని అధికారులు చెబుతున్నారు. బుధవారం నాడు మూసీపై మూడు బ్రిడ్జిలపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పురానాపూల్ వద్ద ఉన్న బ్రిడ్జి, చాదర్ ఘాట్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి, మూసారాంబాగ్ వద్ద బ్రిడ్జిలపై రాకపోకలను నిలిపివేశారు అధికారులు.