జిహెచ్ఎంసీ ఎన్నికలు: పవన్ కల్యాణ్ మీద బాల్క సుమన్ సెటైర్లు

Published : Nov 21, 2020, 12:44 PM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలు: పవన్ కల్యాణ్ మీద బాల్క సుమన్ సెటైర్లు

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనివాడు ఇక్కడ ఏం చేస్తాడని బాల్క సుమన్ ప్రశ్నించారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మీద టీఆర్ఎస్ శాసనసభ్యుడు బాల్క సుమన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పక్క రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ పోటీకి దిగుతానని అనడం హాస్యాస్పదమని ఆయన పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అన్నారు. 

జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పవన్ కల్యాణ్ తో లేడని బాల్క సుమన్ శనివారం మీడియా సమావేశంలో అన్నారు. అలాంటి జనసేన పార్టీని, ఆ పార్టీకి చెందిన వ్యక్తిని బిజెపి కలుపుకోవడం విడ్జూరమని ఆయన అన్నారు. పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనివాడు ఇక్కడ ఏం చేస్తాడని ఆయన పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. 

విస్తృత ప్రయోజనాల కోసం పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ చెబుతున్నారని, ఆ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. బిజెపి నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారని ఆయన అడిగారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు 

బిజెపి, కాంగ్రెసులకు గ్రేటర్ ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నిస్సహాయుడని, రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి అడుకుంటున్నాడని ఆయన అన్నారు. 

టీఆర్ఎస్ పార్టీ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే ప్రతిపక్ష పార్టీల్లో టికెట్ల లొల్లి ఒడవడం లేదని ఆయన అన్నారు. అభ్యర్థులను ప్రకటించడంలో తమ టీఆర్ఎస్ ముందుందని, ఈ రోజు నుంచే కేటీఆర్ రోడ్డు షోలుంటాయని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తోందని, రేపు హైదరాబాదును ప్రశాంతంగా ఉంచే బాధ్యత కూడా తామే తీసుకుంటామని ఆయన చెప్పారు. 

తమ పార్టీ అభ్యర్థుల్లో 50 శాతం విద్యావంతులు, 50 శాతం యువకుల ఉన్నారని ఆయన చెప్పారు. 70 శాతం కన్నా ఎక్కువ ఎస్సీ, ఎస్టీలకు టికెట్లు ఇచ్చామని, టికెట్ల కేటాయింపుల్లో సామాజిక న్యాయం పాటించామని బాల్క సుమన్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్