మోడీ వస్తున్నారు, ట్రంప్ కూడా వస్తాడేమో: బిజెపిపై కేటీఆర్ నిప్పులు

By telugu teamFirst Published Nov 26, 2020, 5:39 PM IST
Highlights

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆల్వాల్ లో రోడ్ షో నిర్వహించారు. తన రోడ్ షోలో కేటీఆర్ బిజెపిపై నిప్పులు చెరిగారు. మోడీ తెలంగాణకు మొండిచేయి చూపారని ఆయన విమర్శించారు.

హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి తీరుపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిప్పులు చెరిగారు జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం ఆయన ఆల్వాల్ లో రోడ్ షో నిర్వహించారు. హైదరాబాదుకు మోడీ వస్తున్నారట, డోనాల్డ్ ట్రంప్ కూడా వస్తారేమో అని ఆయన వ్యాఖ్యానించారు. 

హైదరాబాదుకు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు గుంపులు గుంపులుగా వస్తున్నారని, సింహం సింగిల్ గానే వస్తుందని, కేసీఆర్ సింగిల్ గానే వస్తారని ఆయన అంటూ గుంపు గుంపులుగా ఏం వస్తాయని ఆయన ప్రజలను అడిగారు. వారు చెప్పిన సమాధానానికి ప్రతిస్పందిస్తూ ఆ మాట నేను అనలేదు, కేసైతే మీ మీదే అవుతుందని ఆయన పంచ్ వేశారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చానని అన్నారని, అమిత్ షా అఠానా వేసుకుపోయారని ఆయన అన్నారు. హైదరాబాదులో వరదలు వచ్చినప్పుడు కేంద్ర మంత్రులు ఎటు వెళ్లారని, ఎవరైనా వచ్చారా.. రాలేదని ఆయన అన్నారు. ఇవి హైదరాబాదు ఎన్నికలా, పార్లమెంటు ఎన్నికలా తనకైతే అర్థమైతలేదని ఆయన అన్నారు. 

కర్ణాటకలో వరదలు వస్తే మోడీ 689 కోట్ల రూపాయలు ఇచ్చారని, గుజరాత్ లో వరద్లు వచ్చాయని 500 కోట్లు మోడీ స్వయంగా వెళ్లి ఇచ్చారని అంటూ తెలంగాణకు సాయం చేయాలని కేసీఆర్ లేఖ రాశారని, మోడీ ఉలుకు లేదు.. పలుకూ లేదని ఆయన అన్నారు. దున్నపోతు మీద వానపడ్డట్లుగానే ఉందని కేటీఆర్ అన్నారు. 

కేంద్ర మంత్రులు హైదరాబాదుకు రావడాన్ని స్వాగతిస్తున్నానని, అయితే ఉత్త చేతులతో రావద్దని, నిధులు తీసుకుని రావాలని, లేదంటే ప్రజలు నిలదీస్తారని ఆయన అన్నారు. బిజెపి వద్ద విషయం లేదని, విషం మాత్రమే ఉందని అన్నారు. హిందూ ముస్లిం తప్ప బిజెపికి మరోటి తెలియదని ఆయన అన్నారు. 

వాహనాల చాలన్లు జిహెచ్ఎంసీ కడుతుందని బిజెపి నేతలు చెబుతున్నారని, హెల్మెట్ పెట్టుకోకుండా ప్రమాదాలకు గురి కావాలని చెబుతున్నారా అని ఆయన అన్నారు. బాబరూ బిన్ లాడెన్ లకూ దేశభక్తులకు మధ్య పోటీ అని బిజెపి నాయకులు చెబుతున్నారని, ఈ బాబర్ ఎవరు.. బిన్ లాడెన్ ఎవరు అని అంటూ వారికీ హైదరాబాదుకు ఉన్న సంబంధమేమిటని ప్రశ్నించారు. 

కేంద్ర మంత్రులు, బిజెపి జాతీయ నాయకులు హైదరాబాదు వస్తున్నారని, వారు పొలిటికల్ టూరిస్టులని, వాళ్ల వల్ల ఊదు కాలదు.. పీరు లేవదని అన్నారు. ఉద్వేగాలు రెచ్చగొట్టి మంట పెట్టాలని చూస్తున్నారని, ఆ మంటలో బిజెపి నాయకులు చలి కాచుకుంటారని కేటీఆర్ అన్నారు.  

click me!