వాట్సాప్ లో ఫోటో పెట్టండి.. పాతికవేలు గెలుచుకోండి

By ramya neerukondaFirst Published Oct 16, 2018, 12:17 PM IST
Highlights

ముందస్తు ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమాలకు ప్రారంభించింది. 

వాట్సాప్ లో ఫోటో పెడితే.. రూ.25వేలు గెలుచుకోవచ్చు. ఇది మేము చెబుతున్న మాట కాదండి. జీహెచ్ఎంసీ వాళ్లుచెబుతున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ముందస్తు ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమాలకు ప్రారంభించింది. 

ఇప్పటికే ప్రచార రథాలు, నగరంలోని 92 ప్రాంతాల్లో అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు చైతన్య కార్యక్రమాల్లో ప్రజలను మరింత భాగస్వాములను చేసేందుకు నగదు బహుమతి ఇస్తామంటూ సరికొత్త నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ‘ఫొటో కొట్టు-బహుమతి పట్టు’ అంటు పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌ ఆదేశాల మేరకు ఈ పోటీలు జరుపనున్నారు.
 
18 ఏళ్లు నిండి ఓటరు కార్డు కలిగిన వారు ఎన్నికల ప్రాధాన్యతకు సంబంధించి మంచి ఫొటోతో కూడిన శీర్షిక (క్యాప్షన్‌)ను రాసి 79931 53333 నంబర్‌కు వాట్సప్‌ చేయాలి మెస్సేజ్‌ చేసిన వారు తమ ఓటరు ఐడీ కార్డును కూడా జతచేసి పంపించాలి. నేటి నుంచి నవంబర్‌ 16 వరకు వాట్సప్‌ ద్వారా పంపిన ఫొటోల్లో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి విజేతలను ఎంపిక చేస్తారు. 

మొదటి బహుమతిగా రూ.25,000, రెండో బహుమతి రూ.20,000, తృతీయ బహుమతి రూ.15,000 ఇవ్వనున్నారు. పోటీల్లో పాల్గొనే వారు హైదరాబాద్‌ జిల్లాకు చెందిన వారై ఉండాలని, ఇక్కడి ఓటరు గుర్తింపు కార్డు ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

click me!