
హైదరాబాద్: తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి పెద్ద దెబ్బే తగులుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ తగులుతోంది. గట్టు శ్రీకాంత్ రెడ్డి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉంది.
గట్టు శ్రీకాంత్ రెడ్డి సోమవారంనాడు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. తాను జాతీయ పార్టీలో చేరే అవకాశం ఉందని ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సమయంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
ఆ తర్వాత వెంటనే మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో కలిసి సంజయ్ తో సమావేశమయ్యారు. మంచి రోజు చూసుకుని పార్టీ ముఖ్య నేతల సమక్షంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి బిజెపిలో చేరే అవకాశం ఉంది.
తెలంగాణలో వైసీపీని బలోపేతం చేయడానికి వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సుముఖంగా లేరు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు ఆ మధ్య స్పష్టంగానే చెప్పారు. అదే సమయంలో తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీని స్థాపించబోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారు.