టికెట్ ఇస్తామని .. కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు , పోటీ మాత్రం ఖాయం : తేల్చేసిన గద్ధర్ కుటుంబం

By Siva Kodati  |  First Published Oct 21, 2023, 3:11 PM IST

గద్ధర్ బతికి వున్న రోజుల్లో టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీపై గద్ధర్ భార్య విమల ఆరోపిస్తున్నారు . కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా , ఇవ్వకపోయినా ఎన్నికల బరిలో నిలుస్తామని ఆయన కుమార్తె వెన్నెల స్పష్టం చేశారు.  


తెలంగాణలో ఎన్నికల కోలాహలం నెలకొన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రెండు నెలల ముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించి విపక్షాలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ప్రకటించగా.. బీజేపీ ఇవాళో, రేపో అన్నట్లుగా వుంది. సర్వేలు, ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వుంది. ఇతర పార్టీల నుంచి చేరుతున్న వారితో పాటు నేతలు కూడా పాత గొడవలు మరిచిపోయి వుండటంతో కాంగ్రెస్‌లో జోష్ నెలకొంది. అయితే తమకు సెకండ్ లిస్ట్‌లోనైనా చోటు దక్కుతుందా లేదా అన్న టెన్షన్ నేతలను వెంటాడుతోంది. 

దివంగత ప్రజా గాయకుడు గద్ధర్ కుటుంబం కాంగ్రెస్‌పై భగ్గుమంటోంది. గద్ధర్ బతికి వున్న రోజుల్లో టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని గద్ధర్ భార్య విమల ఆరోపిస్తున్నారు. తన కుమార్తె వెన్నెలకు టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని.. తన బిడ్డకు టికెట్ ఇస్తే ఆమె గెలుపు కోసం కృషి చేస్తానని విమల స్పష్టం చేశారు. వెన్నెల మాట్లాడుతూ.. గద్ధర్ ప్రజా పోరాటాలు, ఆయన చేసిన త్యాగాలను దృష్టిలో వుంచుకుని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. తమకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదని.. కానీ ఆ పార్టీ సానుభూతిపరులమన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా , ఇవ్వకపోయినా ఎన్నికల బరిలో నిలుస్తామని వెన్నెల స్పష్టం చేశారు. 

Latest Videos

undefined

Also Read: Telangana Elections 2023: నవంబర్ మొద‌టివారంలో కాంగ్రెస్ రెండో దశ 'విజయభేరి బస్సు యాత్ర'

మా అన్న సూర్యం చాలా సెన్సిటివ్ అని .. ఆయన ఎన్నికలకు దూరంగా వుంటారని, తాను మాత్రం ఎన్నికల బరిలో నిలబడాలని అనుకుంటున్నాని వెన్నెల పేర్కొన్నారు. వెన్నులో బుల్లెట్ వున్నా తన తండ్రి గద్ధర్ జనం కోసం పరితపించారని.. 2023లో తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ చెప్పారని ఆమె గుర్తుచేశారు. తన తండ్రి కోరిక మేరకు తాను ఎన్నికల బరిలో నిలుస్తానని.. తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని వెన్నెల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి గద్దర్‌ను కాంగ్రెస్ చేరదీసిందని, అండగా వుంటామని చెప్పిందని అందుకే ఈ పార్టీ నుంచే పోటీ చేస్తానని వెన్నెల స్పష్టం చేశారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని.. రాహుల్ పేదలను అక్కున చేర్చుకుంటున్నారని ఆమె కొనియాడారు. 

click me!