కొమరంభీమ్ జిల్లాలో నాటు పడవ బోల్తా: సురక్షితంగా బయటపడిన నలుగురు

By narsimha lode  |  First Published Sep 22, 2022, 10:33 AM IST

కొమరంభీమ్  ఆసిఫాబాద్  జిల్లా అందెవెల్లి వద్ద పెద్దవాగులో నాటు  పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.  పెద్దవాగుపై నిర్మించిన వంతెన కుంగిపోవడంతో నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు స్థానికులు.



కాగజ్‌నగర్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అందెవెల్లి వద్ద  పెద్దవాగులో నాటుపడవ బోల్తా పడింది. ఈ సమయంలో పడవలో ఉన్న నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అందెవెల్లి వద్ద వంతెన కుంగిపోవడంతో ఈ వంతెనపై రాకపోకలను నిలిపివేశారు పోలీసులు.దీంతో అందెవెల్లి  వద్ద పెద్దవాగును దాటేందుకు నాటు పడవలను ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది జూలై మాసంలో కురిసిన వర్షాలతో  అందెవెల్లి వద్ద పెద్దవాగుపై నిర్మించిన వంతెన కుంగిపోయింది.దీంతో  ఈ వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. ఈ వంతెన ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని భావించి అధికారులు రాకపోకలను నిలిపివేసినట్టుగా ప్రకటించారు.

దహేగాం మండల వాసులు కాగజ్ నగర్ కు వెళ్లేందుకు ఇదే వంతెన గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే వంతెన కుంగిపోవడంతో ఇతర మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెఁళ్తే దూరం పెరుగుతుంది. మంచిర్యాల జిల్లా తాండూరు, బెల్లంపల్లి మీదుగా కాగజ్ నగర్ కు చేరుకోవచ్చు. ఇంత దూరం ప్రయాణం చేయాలంటే సమయంతో పాటు ఖర్చు కూడా పెరగనుంది. దీంతో ఈ వంతెన దాటడానికి పెద్దవాగును నాటు పడవల ద్వారా దాటుతున్నారు.  అయితే ఇవాళ నాటు పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. అయితే ఈ  పడవ నుండి నలుగురు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

Latest Videos

undefined

ఇదే జిల్లాలో గతంలో కూడా నాటు పడవలు బోల్తాపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మహరాష్ట్ర ఆహిరి నుండి గూడెం వైపు కొమరంభీమ్ ఆసిపాబాద్ జిల్లాకు నాటు పడవలో పారెస్ట్ అధికారులు వస్తున్న సమయంలో పడవ బోల్తాపడింది.  ఈ ఘటనలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గల్లంతయ్యారు.. చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద ఈ ఘటన 2019 డిసెంబర్ 1వ తేదీన జరిగింది. అక్రమంగా కలపను తరలిస్తున్న స్మగర్ల ఆటకట్టించేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులు నాటు పడవ బోల్తా పడడంతో గల్లంతయ్యారు. 

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాటు పడవ  బోల్తా పడి 11 ఏళ్ల చిన్నారి గల్లంతైంది.  భారీ వర్షాలకు వచ్చిన వరద నీటి నుండి కాపాడుకొనేందుకు నాటు పడవ ద్వారా సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పడవ బోల్తాపడడంతో పలువురు నీటిలో పడిపోయారు. అయితే అంతా సురక్షితంగా బయటపడ్డారు. కానీ 11 ఏళ్ల చిన్నారి మాత్రం గల్లంతైంది. ఈ ఘటన 2019 ఆగష్టు 16న చోటు చేసుకుంది

click me!