వికారాబాద్: వాగులో కొట్టుకుపోయిన కారు... నవ వధువు సహా నలుగురు గల్లంతు వరుడు క్షేమం

By Arun Kumar PFirst Published Aug 30, 2021, 9:42 AM IST
Highlights

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నూతన వధూవరులను భారీ వర్షాలు విడదీశాయి. వికారాబాద్ జిల్లాలో జరిగిన ప్రమాధంలో వధువు ప్రాణాలు కోల్పోయింది. 

వికారాబాద్: తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలు నవ వధువును బలితీసుకున్న విషాద సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ప్రమాదానికి కారణమవుతున్నాయి. ఇలాగే వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగు కూడా ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నంలో నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు నీటిలో కొట్టుకుపోయింది. 

వివరాల్లోకి వెళితే... వికారాబాద్ జిల్లా రావులపల్లికి చెందిన నవాజ్ రెడ్డికి మోమిన్ పేటకు చెందిన ప్రవళికతో నాలుగురోజుల క్రితం(26ఆగస్ట్) వివాహమయ్యింది. ఈ జంట ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించగా ఆ కలకన్ని ఒక్క దుర్ఘటనతో కల్లలయ్యాయి. నవవధూవరులను ప్రమాదానికి గురవగా వరుడు సురక్షితంగా బయటపడినా వధువు ప్రాణాలు కోల్పోయింది. 

పెళ్లి తర్వాత కొత్త జంట మోమీన్ పేటకు వెళ్లింది. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని ఓ కారులో వధూవరులతో పాటు వరుడి అక్కలు రాధమ్మ, శ్వేత, ఓ బాలుడు రావులపల్లికి బయలుదేరారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిమ్మాపూర్ వాగు పొంగిపొర్లుతోంది. ప్రమాదకర రీతిలో నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో వీరి కారు వాగు వద్ద ఆగిపోవాల్సి వచ్చింది.  

read more  తాళ్లతో కట్టుకొని.. కూతురు సహా చెరువులోకి దూకిన దంపతులు

అయితే స్థానికులు వద్దని వారించినా వినకుండా కారును రోడ్డుపై ఉదృతంగా ప్రవహిస్తున్న నీటిలోనే దాటించడానికి ప్రయత్నించారు. నీటి ప్రవాహం ఎక్కువగా వుండటంతో అందరూ చూస్తుండగానే కారు అమాంతం వాగులో కొట్టుకుపోయింది. స్థానికులు కారులోని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో వరుడు నవాజ్ రెడ్డితో పాటు ఓ అక్క సురక్షితంగా ఒడ్డుకు చేరారు. కానీ నవ వధువుతో పాటు ఓ బాలుడు, వరుడి అక్క, కారు డ్రైవర్ ఇలా నలుగురు నీటిలో గళ్లంతయ్యారు.  

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వాగులో గళ్లంతయిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంతో కొద్దిరోజులుగా పెళ్లితో సందడి వున్న ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరికొన్నిరోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందన్న హెచ్చరిక నేపధ్యంలో జాగ్రత్తగా వుండాలని ప్రజలకు సూచించారు. 

click me!