‘‘సాలు మోదీ.. సంపకు మోదీ’’.. హైదరాబాద్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు..

By Sumanth KanukulaFirst Published Jun 29, 2022, 12:00 PM IST
Highlights

జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రధాని మోదీ సహా బీజేపీ ముఖ్యనేతలు హైదరాబాద్‌కు తరలిరానున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని కొన్నిచోట్ల మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు దర్శనమివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటుగా ముఖ్యనేతలు అంతా హైదరాబాద్‌కు తరలిరానున్నారు. అంతేకాకుండా జూలై 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు ప్రధాని మోదీతో పాటు బీజేపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. 

అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని కొన్నిచోట్ల మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు వెలిశాయి. ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే సభలో పాల్గొనాల్సి ఉండగా.. అందుకు పరిసరాల్లోనే మోదీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘‘సాలు మోదీ.. సంపకు మోదీ’’ అంటూ పరేడ్ గ్రౌండ్స్ పక్కనే ఉన్న టివోలీ థియేటర్‌ ఎదురుగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బైబై మోదీ అనే హాష్‌ ట్యాగ్‌‌ను ఫ్లెక్సీలో ఏర్పాటు చేయడమే కాకుండా.. రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్‌, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్‌, నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టినవ్‌, నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏవి?, హఠాత్తుగా లాక్‌డౌన్‌ అని గరీబ్ ఓల్లను చంపినవ్‌, పెద్ద నోట్ల రద్దని సామాన్యుల నడ్డి విరిచావ్‌ అని ముద్రించారు.

Also Read: బీజేపీ‌ ‘ఫ్లెక్సీకి ’ హైదరాబాద్‌లో చోటు కరువు.. కేసీఆర్ వ్యూహం, తలపట్టుకుంటున్న కమలనాథులు

ఫ్లెక్సీల ఏర్పాటుపై సమాచారం అందుకున్న కంటోన్‌మెంట్ సిబ్బంది వెంటనే.. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో మోదీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఇదిలా ఉంటే గత నెలలో మోదీ హైదరాబాద్‌లోని ఐఎస్‌బీకి వచ్చిన సమయంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా నగరంలోని కొన్నిచోట్ల ఫ్లెక్సీలు వెలిసిన సంగతి తెలిసిందే. 

మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోడీ సభ జరగనున్న రోజుల్లో ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడానికి అవకాశం లేకుండా టీఆర్ఎస్ ప్రణాళికలు రచింది. మెట్రో పిల్లర్లు, హోర్డింగ్​లను టీఆర్ఎస్ సర్కార్ ప్రటకనలతో ముంచెత్తింది. ఇందుకోసం ఆయా సంస్థలతో ముందుగానే ఒప్పందం చేసుకుంది. వారం రోజుల పాటు ఈ ప్రచారం సాగనుంది. దీంతో బీజేపీకి సరైన ప్రచారం చేసుకోవడానికి వీలు లేకుండా.. ఎటు చూసిన టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల గురించిన ఫ్లెక్సీలు కనిపించేలా ప్లాన్ చేసింది. 


 

click me!