టూరిజం హెడ్ ఆఫీసులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకుల నుంచి అనుమానాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన మరుసటి రోజు ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్: ఒక వైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని చెబుతున్నాయి. ఇదే తరుణంలో రాజధాని నగరంలోని తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముఖ్యమైన ప్రభుత్వ ఫైల్స్ కాలి బూడిదైపోయాయి. హిమాయత్ నగర్‌లోని ఆఫీసులో డిసెంబర్ 1వ తేదీన ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
శుక్రవారం తెల్లవారుజామున మొదటి అంతస్తులోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
undefined
అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. అయితే, అప్ఫటికే ఈ అగ్ని ప్రమాదంలో ముఖ్యమైన ఫైల్స్ కాలిపోయాయి. టూరిజం, అటవీ శాఖకు సంబంధించిన రికార్డులు ఈ ప్రమాదంలో బుగ్గి అయిపోయాయి. అక్కడ పార్క్ చేసిన అనేక వాహనాలకూ నిప్పు అంటుకున్నది.
అయితే, ప్రభుత్వ మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించడం, అందులో ముఖ్యమైన ప్రభుత్వ రికార్డులు కాలిపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కాంగ్రెస్ వైపు మొగ్గాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదనే చర్చ జరుగుతున్న తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఫైల్స్ కాలిపోవడంపై రాజకీయ విశ్లేషకులూ సంశయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Supreme Court: మహిళపై రేప్ కేసు పెట్టొచ్చా.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
సీపీఐ జాతీయ సెక్రెటరీ నారాయణ్ ఈ ఘటనపై స్పందిస్తూ ఇది ప్రమాదం కానే కాదని, ఉద్దేశపూరితంగా జరిగిన ఘటన అని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఆ కార్యాలయానికి వెళ్లి పరిశీలించానని చెప్పారు. ఇందులో ముఖ్యమైన ఫైల్స్ కాలిపోయాయని, ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, టూరిజం డిపార్ట్‌మెంట్ ఎండీ మనోహర్‌కు బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఆయన మరో వాదన తెర మీదికి తెచ్చారు.