కేసీఆర్ కు పాలన చేతగాకే ధర్నాలు, చావుడప్పులు... వరి వద్దన్న ఈ సీఎం ఇక మనకొద్దు: షర్మిల ఫైర్

By Arun Kumar PFirst Published Dec 22, 2021, 5:31 PM IST
Highlights

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన రైతు ఆవేదన యాత్ర నాల్గవ రోజయిన ఇవాళ(బుధవారం) నిర్మల్ జిల్లాలో జరిగింది. ఈ సందర్భంగా రైతు కుటుంబాల ఆవేదన చూసి తన కంట నీరు ఆగడంలేదని షర్మిల ఆవెదన వ్యక్తం చేసారు. 

నిర్మల్: తెలంగాణలో చోటుచేసుకున్న రైతుల ఆత్మహత్య (farmers suicides)లపై స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysrtp) అధినేత్రి వైయస్ షర్మిల (ys sharmila) విరుచుకుపడ్డారు. వడ్లు కొనడం చేతగాని ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని ఎద్దేవా చేసారు. రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ చేస్తున్న హత్యలేనని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. 

వైఎస్ షర్మిల చేపట్టిన రైతు ఆవేదన యాత్ర (rythu avedana yatra) నాల్గవ రోజయిన ఇవాళ(బుధవారం) నిర్మల్ జిల్లా (nirmal district)లో జరిగింది. దిల్వర్పూర్ మండలంలోని కాల్వ తండాలో బానోత్ అంబర్ సింగ్, సారంగపూర్ మండలంలోని రనపుర్ తండాలో రాతోడ్ శేషురావు, మామ్డ మండలంలోని తాండ్ర గ్రామంలో నాయుడు భీమన్న అనే రైతుల కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 

బానోత్ అంబర్ సింగ్ బోర్లు వేసి అప్పుల పాలయ్యాడని ఆయన కుటుంబం షర్మిలకు తెలిపింది. ఓ వైపు బ్యాంకు వాళ్లు అప్పులు కట్టాలని వేదిస్తుంటే మరోవైపు రైతులు వరి వేయవద్దని కేసీఆర్ చెప్పడంతో  మనస్తాపంతో అంబర్ సింగ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. రాతోడ్ శేషురావు అనే రైతు కూతురు పెండ్లి కోసం అప్పు తీసుకున్నాడని... టీఆర్ఎస్ ప్రభుత్వం వరి వేయవద్దని చెప్పడంతో అప్పులు తీర్చలేనేమోనని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబం తెలిపింది. నాయుడు భీమన్న అనే రైతు వరి పండించగా పండిన వడ్లను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. 

read more  రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే : వైఎస్ ష‌ర్మిల

రైతుల పరామర్శ అనంతరం షర్మిల మాట్లాడుతూ... తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో రైతులకు అప్పులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. రైతులకు బ్యాంకుల్లో కొత్త రుణాలు రాకపోవడంతో బయట అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారని అన్నారు. బ్యాంకు అధికారులు కూడా అప్పులు తీర్చాలని రైతులను వేదిస్తున్నారని రైతు కుటుంబాలు చెబుతున్నాయని షర్మిల పేర్కొన్నారు. 

''రైతు ఆవేదన యాత్రలో ఆత్మహత్యలకు గల కారణాలు తెలుసుకుంటుంటే కంటివెంట నీరు ఆగడం లేదన్నారు.  రైతులు అందరూ కనీస సంపాదన లేకపోయినా అప్పులు తీర్చేందుకే వరి పంట వేస్తున్నారు. అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు'' అని పేర్కొన్నారు. 

''అంబర్ సింగ్ అనే రైతు కుటుంబంపై బ్యాంకు అధికారులే బాధించారు. రైతులపై బ్యాంకు వాళ్లకు కూడా కనికరం లేదు. వరి పంట కొనుగోలు జాప్యం, యాసంగి వరి వేయవద్దని చెప్పడం వల్ల ప్రతీ రోజూ ఇద్దరు, ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి కేసీఆర్ దిగజార్చారు. రైతుల వడ్లు కొనడం కేసీఆర్ కు చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలి. రోజూ ఇద్దరు, ముగ్గురు రైతులను పొట్టన పెట్టుకోవడం భావ్యం కాదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాల ఉసురు కేసీఆర్ కు తప్పకుండా తగులుతుంది. ముఖ్యమంత్రి అన్నాక ముందు చూపుతో రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోగలగాలి. ప్రతీ విషయంలోనూ రాజకీయాలు వెతుక్కుని కేసీఆర్ రాజకీయంగా లబ్దీపొందడం కోసం పనిచేస్తున్నాడు. రాష్ట్రంలో రైతులవి ఆత్మహత్యలు కావు కేసీఆర్ చేస్తున్న హత్యలే'' అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. 

''కేసీఆర్ కు రుణమాఫీ చేయడం చేతకానప్పుడు ఎందుకు హామీనిచ్చారు. రుణమాఫీ చేసి ఉంటే రైతుల ఆత్మహత్యలు జరిగేవి కాదు. ఏడేండ్లలో ఏడువేల మంది, గత 70 రోజుల్లో 200 మంది రైతులు అప్పుల బాధ తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంది రైతులను పొట్టన పెట్టుకున్న కేసీఆర్ ప్రతీ రైతుకు భరోసాను కల్పించాలి. కల్లాల్లో ఉన్న ప్రతీ రైతు వడ్లను కొనుగోలు చేయాలి'' అని షర్మిల డిమాండ్ చేసారు.

''రైతుబంధు పేరుతో ఇస్తున్నది రూ.5000 అయితే ఇన్ పుట్ సబ్సిడీ, యంత్ర లక్ష్మీ, ఎరువులు, విత్తనాల సబ్సిడీలు బంద్ చేసి రూ.25,000 పట్టుకుంటున్నారు. పంట నష్టపోయిన రైతులకు కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కేసీఆర్ ఇవ్వడం లేదు. మద్దతు ధర అంటే రైతులు వేసిన పంటను ప్రభుత్వం భరోసాను కల్పించి కొనుగోలు చేయాలి. వరి పంటకు మద్దతు ధర ఉంది. యాసంగిలో వరి వేయవద్దన్నారంటే రైతు నుంచి భరోసాను కేసీఆర్ లాక్కున్నట్టే. మద్దతు ధర ఉన్న పంటను కొనం అనిచెప్పే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. రైతు వరి పండించడం వరకే ఆయన బాధ్యత, పండించిన వడ్లను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు'' అని అన్నారు. 

read more  సీఎం సొంత జిల్లాలో మరో అన్నదాత ఆత్మహత్య... వైఎస్ షర్మిల ఆవేదన (Video)

''వైఎస్సార్ వ్యవసాయాన్ని పండుగ చేశారు. గతంలో ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిలు చెల్లించి, విత్తనాలు, ఎరువులు, ఇన్ పుట్ సబ్సిడీ, యంత్ర లక్ష్మీ, పంటనష్ట పరిహారం, బోర్లు వేసుకోవడానికి సాయం ఇలా ఎన్నో పథకాలను రైతులకు అందజేసి వైఎస్సార్ సుపరిపాలన చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరి పంటకు మద్దతు ధర రెండింతలు అయ్యింది. సన్న బియ్యం కూడా అధిక ధరకు కొనుగోలు చేశారు.పెట్టుబడిని తగ్గించి రాబడిని పెంచారు. వరికి మద్దతు ధర కల్పించడంతో పాటు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేశారు. సుప్రీంకోర్టులో ఒక ప్రయివేటు కంపెనీతో పోరాడి మరీ విత్తనామల ధరలు తగ్గించారు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాల్సింది. ఇప్పుడు ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్... మద్దతు ధర ఇవ్వకపోగా తాలు, తరుగు, హమాలీ బిల్లు, మిల్లర్ల కట్టింగ్ తో పాటు మద్దతు ధరకు కూడా పంట కొనుగోలు చేయడం లేదు'' అని ఎద్దేవా చేసారు. 

''కేసీఆర్ కు పరిపాలన చేతగాక ధర్నాలు, చావుడప్పు, అపాయింట్ మెంట్ లేకుండా డిల్లీకి పోయి డ్రామాలు చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీచేయలేని, వడ్లు కొనుగోలు చేయలేని చేతగాని ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం రా రైస్ ఎన్నైనా కొనుగోలు చేస్తామని చెబుతోంది. అయినా కూడా వరి వేయవద్దని చెబుతున్నాండటే పాలన చేతగాని ముఖ్యమంత్రి కేసీఆర్. రైతుల వరి కొనుగోలు చేయలేని కేసీఆర్ అధికారంలో ఎందుకు ఉన్నట్టు..?'' అని నిలదీసారు.

''కేసీఆర్ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. కేసీఆర్ కుటుంబం తప్ప ఏ కుటుంబం బాగుపడలేదు. మీ కుటుంబం కోసమే సీఎం పదవి అయితే పరిపాలన చేయడం ఎందుకు ఫామ్ హౌస్ లోకి పోయి పడుకోండి. నిరంకుశ పాలనతో ఇంకా ఎంతమంది రైతులను పొట్టన పెట్టుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కేసీఆర్ ఒక్క రూపాయి అయినా సాయం అందజేశారా..? గ్రామాల్లో ఒక్క రైతును కూడా టీఆర్ఎస్ నాయకులు పరామర్శించింది లేదు. ఎక్కడో హర్యానాలో చనిపోయిన రైతులకు రూ.3 లక్షలు మూడు రోజుల్లో అందజేస్తామని కేసీఆర్ అంటున్నారు. మరి మన రైతులవి ప్రాణాలు కాదా..? తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం అందజేయాలి. వడ్లు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేసీఆర్ దే. కేసీఆర్ దిక్కుమాలిన పాలన వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు'' అని షర్మిల మండిపడ్డారు. 

''దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 46 లక్షల పక్కా ఇండ్లు కట్టించి సుపరిపాలన చేశాడు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు పక్కా ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు న్యాయం చేస్తాం'' అని షర్మిల హామీ ఇచ్చారు. 

  
 

click me!