
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రామనుజవారం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీటీపీఎస్ రైల్వేలైన్ భూసేకరణను స్థానిక రైతులు వ్యతిరేకిస్తున్నారు. బీటీపీఎస్ రైల్వే లైన్ నిర్మాణం కోసం అధికారులు శనివారం భూసేకరణ చేపట్టగా.. రైతులు భూసేకరణను అడ్డుకున్నారు. దీంతో రైతులకు.. అధికారులు, పోలీసులకు మధ్య ఘర్షణ, వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఇక, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బిటిపిఎస్)ని మణుగూరు స్టేషన్‌తో కలుపుతూ విద్యుత్ ప్లాంట్‌కు బొగ్గు రవాణా చేయడానికి రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి భూమిని సేకరించడానికి తెలంగాణ జెన్‌కో అధికారులు ప్రయత్నాలు జరుపుతున్నారు. అయితే దీనిని స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కూడా బీటీపీయస్ రైల్వే లైన్ భూనిర్వాసితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
బీటీపీఎస్ కోసం రైతుల భూముల ను బలవంతంగా పోలీసులను పెట్టి లాక్కుంటున్నారని రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెవిన్యూ అధికారులు లేకుండా భూములు స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు, జెన్కో అధికారులు ఎలా వస్తారని బాధితులు వాపోయారు. కేతినేని రాజేష్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. పోలీసులు రైతులపై విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేయడమే కాకుండా.. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.