ఎగ్జామ్ రాయలేదు, ఇంటర్వ్యూకు వెళ్లలేదు... అయినా రెండు సార్లు సివిల్స్ ర్యాంకర్

By Arun Kumar PFirst Published Sep 27, 2020, 2:22 PM IST
Highlights

సివిల్స్ కు ప్రిపేర్ కాలేదు... ఎగ్జామ్ రాయలేదు... ఇంటర్వ్యూకు అస్సలు అటెండ్ కాలేదు కానీ ఏకంగా రెండుసార్లు సివిల్స్ లో ర్యాంకర్ గా మారాడు. 

హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ కాలేదు... ఎగ్జామ్ రాయలేదు... ఇంటర్వ్యూకు అస్సలు అటెండ్ కాలేదు కానీ ఏకంగా రెండుసార్లు సివిల్స్ లో ర్యాంకర్ గా మారాడు. ఇలా యూపీఎస్సీ ర్యాంక్ పేరిట వీఐపీలు, ఉన్నతాధికారులతో పరిచయాలు పెంచుకుంటున్న ఓ ఘరానా మోసగాడి ఉదంతం తాజాగా బయటపడింది. 

నిజామాబాద్ జిల్లాకు చెందిన సచిన్ మగ్గిడి నకిలీ సివిల్స్ ర్యాంకర్ అవతారమెత్తాడు. తన పేరు కలిగిన వారు సివిల్స్ ర్యాంక్ సాధిస్తే దాన్ని తన ఖాతాలో వేసుకుంటూ ప్రముఖులతో పరిచయాలు పెంచుకునేవాడు సచిన్. ఇలా గతేడాది సచిన్ కుమార్ అనే వ్యక్తి సివిల్స్ సాధించగా... అది తానేనంటూ మగ్గిడి సచిన్ ప్రచారం చేసుకున్నాడు. అయితే ఐఎఎస్ రానందును మరోసారి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్లు అందరినీ నమ్మించాడు. 

ఈ ఏడాది కూడా సచిన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి  సివిల్స్ ర్యాంక్ సాధించాడు. దీంతో మగ్గిడి సచిన్ మరోసారి ర్యాంకర్ అవతారమెత్తాడు. ఈ సచిన్ యాదవ్ తానేనంటూ ప్రచారం చేసుకోవడం ప్రారంభించాడు. అయితే సతిష్ యాదవ్ ఫోటోలు ప్రసార మాద్యమాల్లోనూ, అతడి మాక్ ఇంటర్వ్యూలు యూట్యూబ్ లోనూ వుండటంతో నకిలీ ర్యాంకర్ గుట్టు రట్టయింది. దీంతో కొందరు విద్యార్థులు నిజామాబాద్‌ కలెక్టర్‌కు ఈ నకిలీ సివిల్స్ ర్యాంకర్ పై ఫిర్యాదు చేశారు.  
 
 

click me!