దోషం పోగొడతానని.. బంగారం దోచుకెళ్లిన స్వామిజీ

First Published Jul 10, 2018, 9:54 AM IST
Highlights

ఓ ఛానల్లో తత్వపితా రామకృష్ణ చైతన్య స్వామీజీ పేరుతో ఓ ఫోన్‌ నెంబర్‌ స్క్రోల్‌ అవుతోంది. దోషాలు పోగొట్టి బాగు చేస్తాడని ఛానల్లో చెప్పడంతో సదరు నెంబర్‌కు విజయలక్ష్మి ఫోన్‌ చేసి స్వామీజీతో మాట్లాడి విషయం చెప్పింది.

తాము దైవ స్వరూపులమని చెబుతూ.. చాలా మంది దొంగ బాబాలు ప్రజలను మోసం చేసిన ఘటనలు ఇప్పటి వరకు చూశాం. తాజాగా మరో  సంఘటన వెలుగు చూసింది.  ఇంటి పరిస్థితులు చక్కబెడతానని చెప్పి.. 62తులాల బంగారాన్ని కాజేసాడు. బంగారం పోయాకగానీ.. తాము మోసపోయామన్న విషయాన్ని బాధితులు గుర్తించలేకపోయారు.ఈ సంఘటన కాటేదాన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. టేదాన్‌ టీఎన్‌జీఓస్‌ కాలనీలో ఉండే ప్రసాద్‌ వ్యాపారం సరిగా నడవడం లేదు. కుమార్తె ఆరోగ్యం కూడా బాగాలేకపోవడంతో ప్రసాద్‌ భార్య విజయలక్ష్మి మదనపడుతోంది. ఈ ఏడాది మార్చి 11న ఇంట్లో విజయలక్ష్మి టీవీ చూస్తుండగా.. ఓ ఛానల్లో తత్వపితా రామకృష్ణ చైతన్య స్వామీజీ పేరుతో ఓ ఫోన్‌ నెంబర్‌ స్క్రోల్‌ అవుతోంది.

 దోషాలు పోగొట్టి బాగు చేస్తాడని ఛానల్లో చెప్పడంతో సదరు నెంబర్‌కు విజయలక్ష్మి ఫోన్‌ చేసి స్వామీజీతో మాట్లాడి విషయం చెప్పింది. ఆ మరుసటి రోజే స్వామీజీ విజయలక్ష్మి ఇంటికి వచ్చి పలు పూజలు చేశాడు. మీ ఇంటికి బంగారు దోషముందని.. దానిని పోగొడతానని నమ్మించాడు. కుమార్తె ఆరోగ్యం బాగవుతుందని.. తాను చెప్పినట్లు చేయాలన్నాడు. 

తన సంచిలోని ఓ చెంబును తీసి అందులో మీ నగలన్నీ వేయమని చెప్పాడు. విజయలక్ష్మి నగలన్నీ తెచ్చి చెంబులో వేసింది. ఆ చెంబుకు వస్త్రం చుట్టి పూజలు చేశాడు. పెద్దగా పొగ వేసి.. ఆ పొగలో నగలున్న చెంబును తీసి.. అలాంటిదే మరోటి అక్కడ పెట్టాడు. పూజలు ముగిశాయని, ఈ చెంబుపై వస్త్రాన్ని ఇప్పుడే తీయొద్దని, మూడు నెలల తర్వాత తీస్తేనే దోషం పోతుందని చెప్పి వెళ్లిపోయాడు. 

మూడునెలల తరువాత అంటే ఈ ఏడాది జూన్‌ నెలాఖరున విజయలక్ష్మి స్వామీజీకి ఫోన్‌ చేశారు. రాంగ్‌ నంబరని వచ్చింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా.. స్పందన లేదు. ఈనెల 8న అనుమానంతో నగలు భద్రపరిచి ఉన్న చెంబుపై వస్త్రాన్ని తీసి చూడగా అందులో నగలు లేవు. నువ్వులు, రాగులు ఉన్నాయి. దీంతో సుమారు 62 తులాల నగలు పోయినట్లు విజయలక్ష్మి  ఫిర్యాదు చేసింది. 

click me!