Fact Check: మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్య యత్నం.. అసలు అక్కడ జరిగింది ఏమిటంటే..?

By Sumanth KanukulaFirst Published Aug 8, 2022, 1:08 PM IST
Highlights

ఉమ్మడి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి‌లో తమ భూమిని లాక్కుంటున్నారనే ఆవేదనతో ఓ యువ రైతు ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. అసలు ఆ యువ రైతు ఎందుకు ఆత్మహత్యకు యత్నించాడు..?, అసలు అక్కడ ఏం జరిగింది..?, అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

ఉమ్మడి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి‌లో తమ భూమిని లాక్కుంటున్నారనే ఆవేదనతో ఓ యువ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. తాను ఆత్మహత్యకు యత్నిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే తొలుత రైతు మరణించాడని వార్తలు వెలువడినా.. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు యువ రైతు తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నదని ప్రచారం జరిగినా అందులో నిజం లేదని తేలింది. అసలు ఆ యువ రైతు ఎందుకు ఆత్మహత్యకు యత్నించాడు..?, అసలు అక్కడ ఏం జరిగింది..?, అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. 

దేవులపల్లి గ్రామానికి చెందిన జింక శ్రీశైలంకు గ్రామ శివారులోని అటవీభూమి పక్కన సాగుభూమి ఉంది. దాని పక్కనే ఉన్న కొంత అటవీభూమిని కాస్తు చేస్తూ పంటల పండిస్తున్నాడు. అందులో రూ. 50 వేలు పెట్టి మిరప పంట వేశాడు. అయితే కొన్ని నెలల క్రితమే అతడు పంట వేసిన భూమితో పాటు పక్కనే ఉన్న 5 ఎకరాలను బృహత్ పల్లె ప్రకృతివనం ఏర్పాటుకు కేటాయించారు. దీంతో అధికారులు శనివారం.. ఆ భూమిలోని మిరప పంటను తొలగించేందుకు యత్నించారు. మిగతా భూమితోపాటు శ్రీశైలం పోడు చేసుకుంటున్న అటవీభూమిని సైతం దున్ని చదును చేయాలని అటవీ శాఖ అధికారులు సిబ్బందికి చెప్పారు. 

అయితే సిబ్బంది పంటను తొలగిస్తుండగా శ్రీశైలం అడ్డుకున్నారు. ఈ భూమిని తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ భూమిని లాక్కుంటే తమకు చావే పరిష్కారమని శ్రీశైలం, అతని కుటంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై శనివారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శ్రీశైలం తన బాధను సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశాడు. ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. పురుగుల తాగి అక్కడే కిందపడిపోయాడు.  వీడియోను చూసిన కొందరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అతడిని మెదక్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం శ్రీశైలంకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

‘‘శ్రీశైలం ఇప్పటికే అటవీ భూమిని ఆక్రమించి వరి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కొత్తగా మరో ఎకరా అటవీభూమి దున్ని మిరప పంట సాగు చేస్తున్నాడు. అటవీ భూమి కావడంతో పల్లెప్రకృతి వనం కోసం చదును చేస్తుండగా అడ్డుకొని ఇష్టానుసారంగా దూషించాడు. భూమికి సంబంధించి ఆధారాలు చూపించలేకపోయాడు. సిబ్బంది పనులకు అడ్డు తగలడంతో వాటిని నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు’’ అని డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓ రాజమణి తెలిపినట్టుగా సాక్షి మీడియా పేర్కొంది.

ఇక, శ్రీశైలం సెల్పీ వీడియోలో.. స్థానిక సర్పంచ్‌తో కలిసి అటవీశాఖ అధికారులు తన పొలాన్ని ధ్వంసం చేశారని ఆరోపించాడు. ఆ ఐదు ఎకరాల భూమిని తన పూర్వీకుల కాలం నుంచి సాగుచేస్తున్నారని చెప్పారు. ఆ భూమిలో వేసిన రూ. 50వేల మిర్చి పంటను నాశనం చేశారని తెలిపారు. బృహత్ పల్లె ప్రకృతి వనం అభివృద్ధి చెందాలంటే భూమిని ఖాళీ చేయాలని అధికారులు కోరారని తెలిపారు. తన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిని పోషించేందుకు తనకు వేరే ఆదాయ మార్గం లేదన్నారు.

రైతు, అతని తల్లి చనిపోయారని అసత్య ప్రచారం.. 
శ్రీశైలం సెల్పీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు పురుగుల మందు తాగడంతో.. అతడు మరణించాడనే ప్రచారం సాగింది. ఈ విషయం తెలిసి అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం మొదలైంది. అది నిజమనే ప్రాథమిక సమాచారంతో కొన్ని మీడియా సంస్థలు కూడా వీడియోలను ప్రసారం చేశాయి. రైతుతో పాటు, అతని తల్లి కూడా చనిపోయారనే ప్రచారం సాగింది. పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ వీడియోను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. అయితే అదంతా అసత్య ప్రచారం అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రైతు శ్రీశైలంకు ఆస్పత్రిలో చికిత్స సాగుతుండగా.. అతని తల్లి ఆత్మహత్యకు యత్నించలేదని తేలింది.

click me!