తైవాన్ పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం.. ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో మంత్రి కేటీఆర్

By telugu teamFirst Published Sep 30, 2021, 6:03 PM IST
Highlights

రాష్ట్రంలో తైవాన్ నుంచి వచ్చే పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తైవాన్, తెలంగాణల మధ్య అద్భుతమైన భాగస్వామ్యం నెలకొని ఉన్నదని అన్నారు. తమ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆశిస్తున్నదని, అందులో తైవాన్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తైవాన్ పెట్టుబడులకు తమ ప్రభుత్వం ఆది నుంచి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ, తైవాన్‌ల మధ్య అద్భుతమైన భాగస్వామ్యం నెలకొని ఉన్నదని వివరించారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన తైవాన్ కనెక్ట్ తెలంగాణ స్టేట్ సమవేశానికి హాజరైన మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

పెట్టుబడుల కోసం తాను తైవాన్ దేశ పర్యటన చేశారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తైవాన్ కంప్యూటర్ అసోసియేషన్‌తో టెక్నాలజీ పార్ట్‌నర్షిప్ అగ్రిమెంట్ విషయాన్నీ ప్రస్తావించారు. తైవాన్ స్టార్టప్ అలయెన్స్ ఏర్పాటు చేసుకున్న ఏకైక భారత నగరంగా హైదరాబాద్ అని వివరించారు. 2020 నుంచి కరోనాతో వ్యాపార వాణిజ్యానికి సవాల్లు వస్తున్నాయని, అయితే, నేడు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్నదని, తెలంగాణలో పెట్టుబడులకు వాతావరణం సానుకూలంగా ఉన్నదని వివరించారు. 

తెలంగాణ ఇప్పటికే 32 బిలియన్ డాలర్ పెట్టుబడులను ఆకర్షించిందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ఎప్పుడూ అగ్రస్థానంలో నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆశిస్తున్నదని, అందులో తైవాన్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

ఇదే సమావేశంలో మాట్లాడిన ఇన్వెస్ట్ ఇండియా సీఈవో దీపక్ బగ్లా తెలంగాణ రాష్ట్ర పాలసీలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. తైవాన్‌కు తెలంగాణ సహజ భాగస్వామి అని తైవాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ జేమ్స్ ఎఫ్ హువాంగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, డైరెక్ట్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపూరి పాల్గొన్నారు.

click me!