బాత్‌రూంలో జారిపడి తుంటి ఎముకకు గాయం కావడంతో ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. పార్టీ శ్రేణులు, అభిమానులు, రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు.
బాత్‌రూంలో జారిపడి తుంటి ఎముకకు గాయం కావడంతో ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. పార్టీ శ్రేణులు, అభిమానులు, రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. తనను చూసేందుకు యశోదా ఆసుపత్రికి రావొద్దని కేసీఆర్ కోరారు. తనతో పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వందలాది మంది రోగులకు ఇబ్బంది కలగకుండా వుండేందుకే తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.
ఇన్ఫెక్షన్ సోకుతుందనే వైద్యులు తనను బయటకు పంపడం లేదని, తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుని మీ ముందుకు వస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆసుపత్రి బెడ్ నుంచి ప్రజలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత . తనపై అభిమానం చూపుతున్న కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గత స్వరంతో చేతులు జోడించి వేడుకున్నారు కేసీఆర్.
దయచేసి సహకరించండి
నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు
కోలుకుని త్వరలోనే మీ నడుమకు వస్తా
ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపుతలేరు
యశోద దవాఖాన కు రాకండి
- ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి విజ్ఞప్తి
తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని పరామర్శించడానికి… pic.twitter.com/5pnev7TP16
గురువారం రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో కేసీఆర్ కాలుజారి పడిపోయారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్యుల బృందం పలు పరీక్షలు నిర్వహించి తుంటి ఎముక విరిగినట్లుగా గుర్తించి శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్ధితిపై ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. అటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.