తెలంగాణలో బిజెపికి షాక్: మోత్కుపల్లి రాజీనామా, కారు ఎక్కేందుకు రెడీ?

By telugu teamFirst Published Jul 23, 2021, 12:06 PM IST
Highlights

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బిజెపికి రాజీనామా చేశారు. నిజానికి చాలా కాలంగా ఆయన బిజెపికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల కేసీఆర్ అఖిల పక్ష సమావేశానికి బిజెపి వైఖరిని బేఖాతరు చేస్తూ హాజరయ్యారు.

హైదరాబాద్: తెలంగాణలో బిజెపికి షాక్ తగిలింది. సీనియర్ నేత., మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బిజెపికి రాజీనామా చేశారు. చాలా కాలంగా ఆయన బిజెపి కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ స్థితిలో ఆయన తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఆయన టీఆర్ఎస్ కు దగ్గరైనట్లు కనిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బిజెపి దూరంగా ఉంది. అయితే, పార్టీ వైఖరిని బేఖాతరు చేస్తూ ఆయన దళితులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో పాల్గొన్నారు. దీన్నిబట్టి ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు అద్భుతమని ఆయన ప్రశంసించారు. 

ఈటల రాజేందర్ మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజేందర్ కు అంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ను బిజెపిలో చేర్చుకోవడం బాధించిందని ఆయన చెప్పారు. ఈటల రాజేందర్ అవినీతిపరుడని ఆయన అన్నారు. తన అనుభవాన్ని బిజెపి పట్టించుకోలేదని విమర్శించారు. ఈటలను హుజూరాబాద్ ప్రజలు బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈటలను ఆయన ఆక్రమణదారుడిగా అభివర్ణించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈటలకు అర్హత లేదని ాయన అన్నారు.

దళిత భూములను, దేవాలయ భూములను ఈటల ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. బిజెపిలో దళితుల మనోభావాలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. బిజెపి అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించినప్పటికీ తాను హాజరు కావడాన్ని ఆయన సమర్థించుకున్నారు. బిజెపిలో కార్యవర్గ సభ్యుడిగా కూడా స్థానం కల్పించలేదని ఆయన అన్నిారు.

మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో చేరి హుజూరాబాద్ శాసనసభకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే సందేహం కలుగుతోంది. హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ కౌశిక్ రెడ్డికి ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన సమయంలో కేసీఆర్ పరోక్షంగా ఆ విషయం చెప్పారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కన్నా మంచి పదవి ఇస్తామని ఆయన చెప్పారు. 

దళిత వర్గాల నుంచి రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చిన మోత్కుపల్లికి రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. 

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సింహులు తొలుత కాంగ్రెసులో చేరారు. ఆ తర్వాత బిజెపిలోకి వచ్చారు. కేసీఆర్ ను ఎదుర్కోవడంలో ఆయన తీవ్రమైన దూకుడు ప్రదర్శించారు. కేసీఆర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన టీఆర్ఎస్ లోకి రావచ్చునని భావిస్తున్నారు.

click me!