తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే డుమ్మా కొట్టారు. వైద్యులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారని, అందుకే రాలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. కాదు, కాదు, కాళేశ్వరంపై సమాధానాలు చెప్పలేక తప్పించుకున్నాడని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నది. గవర్నర్ ప్రసంగం మాత్రమే ఉండే తొలి రోజున, ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగే రోజన కేసీఆర్ రాకపోవచ్చని, కానీ, బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున వచ్చే అవకాశం ఉన్నదని మరికొందరు చెబుతున్నారు.
KCR: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నది. సుమారు వారం రోజుల పాటు అంటే ఈ నెల 17వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నది. ఉద్యమపార్టీగా పేరున్న బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి హాజరవుతున్నది. ముఖ్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు రక్తికట్టిస్తాయని అందరూ ఊహించారు. కానీ, కేసీఆర్ ఈ సమావేశాలకు డుమ్మా కొట్టారు. దీనిపైనా రాజకీయ దుమారం రేగింది.
తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన కేసీఆర్‌కు ఇంకా విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారని, రెస్ట్ కోసమే ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఆయన సెంటిమెంట్లను ప్రస్తావిస్తున్నారు. అమావాస్యకు ముందు బడ్జెట్ సమావేశాలకు రావడంపై ఆయన నిరాసక్తి చూపించారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు సెంటిమెంట్లు ఎక్కువ. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి కూడా ముహూర్తం చూసుకుని వచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులతో భేటీలపైనా టైమ్ చూసుకున్నారు.
కాగా, కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ పై విమర్శలు సంధిస్తున్నది. కాళేశ్వరంపై సమాధానం చెప్పలేకే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని ఆరోపిస్తున్నది. ఇటీవలే తెలంగాణ భవన్‌కు వచ్చి పార్టీ నాయకులతో చర్చలు చేసిన కేసీఆర్‌కు సమీపంలోనే ఉన్న అసెంబ్లీకి రావడానికి అభ్యంతరమేలా? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నది.
Also Read: Janasena: ఏపీలో అద్భుతం జరుగుతుంది.. అందరూ సహకరించాలి: జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు
ఇదంతా కాదని, మరో కారణాన్ని కూడా ఇంకొన్ని రాజకీయ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో విభేదాలు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానైనా కలువలేదు. అదీగాక, తన రాజీనామా పత్రాన్ని ఓఎస్డీ ద్వారా పంపారు. కేసీఆర్ ప్రతిపక్షానికి వచ్చినా.. గవర్నర్‌తో మాత్రం ఆ డిస్టెన్స్ అలాగే కొనసాగుతున్నది. అందుకే ఈ రోజు అసెంబ్లీకి రాలేదని చెబుతున్నారు. పైగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. రోజంతా ఆమె ప్రసంగించిన తర్వాతి రోజు ఆమెకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైనా ప్రసంగించాల్సి ఉంటుంది. కాబట్టి, ఇవి కేసీఆర్‌కు నచ్చలేదని, అందుకే అసెంబ్లీకి రాలేదని, అయితే.. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున మాత్రం అసెంబ్లీకి వస్తారని వివరించాయి.
ఈ సమావేశాలు ఫిబ్రవరి 17 తేదీ వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవధిలోనే నల్గొండలో 13న బీఆర్ఎస్ బహిరంగ సభ ప్లాన్ చేసింది. ఇందుకు కేసీఆర్ తప్పకుండా హాజరవుతారని బీఆర్ఎస్ చెప్పింది. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి బహిరంగ సభకు రావడం సాధ్యం కాదు. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున అసెంబ్లీకి ఆయన వస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నది.