దళితులతోపాటు ఇతర కులాల్లోని పేదలకూ ‘బంధు’ అందించాలి: ఈటల

By telugu teamFirst Published Aug 16, 2021, 3:09 PM IST
Highlights

దళిత బంధు పథకాన్ని దళితులతోపాటు ఇతర కులాల్లోని పేద కుటుంబాలకూ వర్తింపజేయాలని ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే వాసాలమర్రిలో ప్రారంభించిన ఈ పథకంపై ఇంత ప్రచారం ఎందుకు చేస్తున్నారని అడిగారు. ఇది కేవలం ఎన్నికల్లో అస్త్రంగా మిగిలిపోకూడదని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు అర్హులకు నిధులు అందించాలని డిమాండ్ చేశారు. సీఎం సభ కారణంగా హుజురాబాద్‌లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారని, వారిని నిర్బంధించడానికి పోలీసు స్టేషన్లు, పాఠశాలలు సరిపోవడం లేదని చెప్పారు. మీటింగ్‌కు ప్రజలు వస్తారో రారో అనే సంశయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలను ఇక్కడి తరలిస్తున్నారని విమర్శించారు.

హుజురాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపఎన్నిక జరగనున్న హుజురాబాద్‌కు వస్తున్న తరుణంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీఎంపై మండిపడ్డారు. సీఎం మీటింగ్ కోసం హుజరాబాద్‌లో వేలాది మంది యువతను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. వారిని నిర్బంధించడానికి పోలీసు స్టేషన్‌లు, పాఠశాలలు నిండిపోయాయని అన్నారు. ఇవి సరిపోవడం లేదని తెలిపారు. హుజరాబాద్ నియోజకవర్గం పోలీసు పహారాలో ఉన్నదని, నియోజకవర్గమంతా భయం గుప్పిట్లో ఉన్నదని వివరించారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. నేడు హుజురాబాద్‌లో నిర్వహిస్తున్న సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు.

దళిత బంధు పథకాన్ని తాను స్వాగతిస్తున్నానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ పథకాన్ని కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక కోసం వాడుకోవద్దని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే దళిత బంధు కింద రూ. పదిలక్షలు నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి అందించాలని డిమాండ్ చేశారు. అది కూడా కలెక్టర్, అధికారులు, బ్యాంక్ మేనేజర్ల అజమాయిషీ లేకుండా ఖర్చు పెట్టుకొనే స్వేచ్చ కలిపించాలని అన్నారు. అంతేకాదు, ఈ పథకాన్ని కేవలం దళితులకే పరిమితం చేయవద్దన్నారు. ఇతర కులాల్లోని పేదలకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇతర కులాల్లోనూ కడు పేదరికాన్ని అనుభవిస్తున్న కుటుంబాలున్నాయని వివరించారు. ఎరుకల, వడ్డెర, సంచార జాతులు, కుమ్మరలు,విశ్వకర్మలు, పద్మ శాలీలు, నాయీ బ్రాహ్మణులు, రజకు,గౌడ,ముదిరాజ్, కాపుతో పాటు తెలంగాణ లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇది అందించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌ను హుజూరాబాద్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఈటల అన్నారు. అందుకే ప్రజలు వస్తారో రారో అనే భయంతో తెలంగాణ వ్యాప్తంగా అన్నీ జిల్లాలకు బస్సులు పెట్టి టిఆర్ఎస్ కార్యకర్తలను మీటింగ్ కు తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్న ఊరికి కూడా RTC బస్సులు పంపి జనాన్ని తరలిస్తున్నారని, టిఆర్ఎస్ ప్రభుత్వ పరిస్థితి ఎంతటి దుస్థితిలో ఉన్నదని ఇదే వెల్లడిస్తున్నదని అన్నారు. మీటింగ్ నిర్వహిస్తున్న గ్రామంలోనూ బస్సులు పెట్టి జనాన్ని తీసుకుపోయే దుస్థితికి అధికార పార్టీ చేరుకుందని అన్నారు. ఈ తరలింపు బాధ్యత టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్స్, వీఆర్‌వో, వీఆర్ఏలు, వేలామందికి అప్పగించారు. అసలు ఇది ప్రజల మీటింగే కాదని విమర్శించారు. 

దళితబంధు కడు బీదరికంలో ఉన్న దళితులను ఆదుకోవడానికి పెట్టిన పథకం, కానీ ఇంత డబ్బు ఖర్చుచేసి ప్రచారం ఎందుకు అని ఈటల ప్రశ్నించారు. అయినా ఇప్పటికే ప్రారంభించిన ఇంత భారీ ఏర్పాట్లు ఎందుకు అని అడిగారు. వాసాలమర్రిలో ప్రారంబించిన దళితబంధు కార్యక్రమానికి ఎన్నికల కోసమే ఇక్కడ అతి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రజల సొమ్మును పార్టీ ప్రచారానికి వాడుకుంటున్న కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

click me!