కరోనా టీకా.. హైదరాబాద్ కి 80దేశాల రాయబారులు

By telugu news teamFirst Published Dec 9, 2020, 8:18 AM IST
Highlights

మొదటి బృందంలోని వారు ఉదయం 11.45 గంటలకు భారత్ బయోటిక్ లిమిటెడ్ ను సందర్శిస్తారు. టీకాల తయారీపై  దృశ్య రూపక ప్రదర్శనను చూసే అవకాశం ఉంది.

కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి 80దేశాల రాయబారులు, హైకమిషనర్లు బుధవారం హైదరాబాద్ కి రానున్నారు. భారత్ లో టీకాల పురోగతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పర్యటన ఏర్పాటు  చేసింది. వారు ఉదయం 10.15 గంటలకు శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి శామీర్ పేట వద్ద గల జినోమ్ వ్యాలీకి వెళ్లనున్నారు.

అక్కడ రెండు బృందాలుగా పర్యటిస్తారు. మొదటి బృందంలోని వారు ఉదయం 11.45 గంటలకు భారత్ బయోటిక్ లిమిటెడ్ ను సందర్శిస్తారు. టీకాల తయారీపై  దృశ్య రూపక ప్రదర్శనను చూసే అవకాశం ఉంది. అక్కడి నుంచి బయోలాజికల్- ఇ సంస్థకు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ  అధికారులు  తెలంగాణలో టీకాల తయారీ సంస్థల సామర్థ్యం, పనితీరు, జీనోమ్ వ్యాలీ, ఔషధనగరిపై దృశ్యం ప్రదర్శిస్తారు.

అనంతరం రాయబారులు, హైకమిషనర్లు బయోలాజికల్-ఇలోని సౌకర్యాలను పరిశీలించడంతోపాటు శాస్త్రవేత్తలతో భేటీ అవుతారు. రెండో బృందం తొలుత బయోలాజికల్-ఇ సంస్థను సందర్శించి, ఇక్కడి సౌకర్యాలను పరిశీలిస్తుంది. రాష్ట్ర  ప్రభుత్వ అధికారులు టీకాల తయారీ సామర్థ్యంపై ఇచ్చే దృశ్యరూపక ప్రదర్శనను తిలకిస్తుంది. అక్కడి నుంచి భారత్ బయోటెక్ లిమిటెడ్ కు చేరుకొని అక్కడ శాస్త్రవేత్తలతో రాయబారులు, హైకమిషనర్లు భేటీ అవుతారు.

టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను తిలకిస్తారు. సాయంత్రం 6గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరతారు. పెద్దల సంఖ్యలో విదేశీ రాయబారులు, హైకమిషనర్లు తెలంగాణను సందర్శించడం ఇదే ప్రథమం. వారి పర్యటనను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
 

click me!