కాళేశ్వరంపై హైకోర్టులో పిల్: కీలక ఆదేశాలు

By narsimha lodeFirst Published Jan 19, 2021, 4:20 PM IST
Highlights

పైప్‌లైన్ ద్వారా 3 టీఎంసీల నీటిని తరలించడాన్ని సవాల్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.

హైదరాబాద్: పైప్‌లైన్ ద్వారా 3 టీఎంసీల నీటిని తరలించడాన్ని సవాల్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.

తెలంగాణ ఇంజనీర్  ఫోరమ్ కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని లక్ష్మీనారాయణ న్యాయవాది రంగయ్య హైకోర్టును కోరారు. అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించింది.

పైప్ లైన్ ద్వారా నీటిని తరలిస్తే ప్రభుత్వంపై ఏటా రూ. 8 వేల కోట్ల అదనపు భారం పడుతోందని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు.

నీటి తరలింపు ప్రక్రియను పాత పద్దతినే కొనసాగించాలని ఆయన కోర్టును కోరారు. ఇప్పటిదాకా 2 టీఎంసీల కెనాల్ గ్రావిటేషనల్ టన్నెల్ అండ్ లిఫ్ట్ సిస్టం  ద్వారా తరలించడం ద్వారా ప్రభుత్వంపై ఏటా వేల కోట్ల రూపాయాల భారం పడుతోందన్నారు.

పైప్ లైన్ పద్దతి వల్ల భూసేకరణ, విద్యుత్ ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పిటిషనర్ ఆరోపించారు.సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిందని పిటిషనర్ కోర్టుకు వివరించారు.

మేడిగడ్డ నుండి కాళేశ్వరానికి కాలువల ద్వారానే నీటి సరఫరా జరిగిందని పిటిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 

click me!