విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై వ్యతిరేకత.. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళ..

By Sumanth KanukulaFirst Published Aug 8, 2022, 3:36 PM IST
Highlights

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీరింగ్ జేఏసీ దేశ వ్యాప్త విధుల బహిష్కరణ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీరింగ్ జేఏసీ దేశ వ్యాప్త విధుల బహిష్కరణ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని విద్యుత్ సౌధ  ఉద్యోగులు మహాధర్నాను తలపెట్టారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసకు దిగారు. నూతన బిల్లు ద్వారా విద్యుత్ శాఖ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారేందుకు అవకాశం ఉందని ఉద్యోగులు ఆరోపించారు. గతంలో తీసుకొచ్చిన చట్టాన్నే కాస్తా మార్చి కేంద్రం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. కొత్త బిల్లుతో దేశ ప్రజలందరికీ నష్టం చేకూరుతుందని అన్నారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు. విద్యుత్‌ చట్టసవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేపట్టారు.

విద్యుత్ సౌధ వద్ద ధర్నా చేపట్టిన ఉద్యోగులకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ రంగంపై రాష్ట్రాలకు హక్కు లేకుండా చేస్తోందని అన్నారు. కేంద్రం ఈ బిల్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు జిల్లాల్లో కూడా విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించారు. జిల్లాలోని కేటీపీపీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. కేటీపీపీ ప్రధాన గేటు ముందు ధర్నా చేపట్టారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా విద్యుత్ ఉద్యోగులు మహాధర్నాకు చేపట్టారు. విద్యుత్ సవరణ బిల్లపై కేంద్రం వైఖరిలో మార్పు రాకపోతే.. మెరుపు ధర్నాకు దిగేందుకు సిద్దంగా ఉన్నట్టుగా ఉద్యోగులు చెప్పారు. 

ఇక, తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళనతో  రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి.
 

click me!