తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ బోయినపల్లి మనోహర్ రావు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ) వై సత్యనారాయణలను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.
తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ బోయినపల్లి మనోహర్ రావు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ) వై సత్యనారాయణలను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి తిరుమలకు వెళ్లడం ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ని ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తీసుకుంది. మనోహర్ రావు, సత్యనారాయణలను సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిని మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు స్పష్టమైన కేసుగా పేర్కొన్న ఎన్నికల సంఘం.. మనోహర్ రావు, సత్యనారాయణలపై శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు అధికారుల ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ను ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాకుండా.. ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలను నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నివేదించాలని స్పష్టం చేసింది.
ఈసీఐ సెక్రటరీ సంజయ్ కుమార్ ప్రకటనలో.. ‘‘కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమల్లోకి వచ్చింది. అక్టోబరు 15,16 తేదీల్లో మనోహర్‌రావు, సత్యనారాయణ తిరుమలకు వెళ్లారని.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కనిపించారని ఫిర్యాదు అందింది. ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంపిన నివేదికను ఈసీఐ పరిశీలించింది,.ఇది అభియోగాన్ని రుజువు చేసింది. ఒక మంత్రి, అభ్యర్థితో పాటు, ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్‌కు సంబంధించి పోల్ ప్యానెల్ జారీ చేసిన సూచనలను అధికారులు ఉల్లంఘించారని పేర్కొంది.
ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా పరిపాలన అధికారులు.. కేంద్ర లేదా రాష్ట్రాల్లోని కేబినెట్ మంత్రులు ఎన్నికల పర్యటనలో లేదా ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం స్వీకరించకూడదు, కలవకూడదు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, స్వచ్ఛమైన వాతావరణంలో జరగవని ప్రజలు భావించే సందర్భం రాకుండా ఉండేందుకు తమ నిష్పాక్షికత పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా వారు తమ ప్రవర్తనను కొనసాగించాలి’’ అని పేర్కొన్నారు. ఇక, మంత్రి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.