హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఆన్ స్క్రీన్ బంద్... ఆఫ్ స్క్రీన్ సీన్ షురూ!

By telugu teamFirst Published Oct 19, 2019, 5:06 PM IST
Highlights

 ఈ నెల 21వ తేదీన  హుజూర్‌ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికకు ప్రచారం ముగిసింది. ఈ ఉప ఎన్నికతోపాటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వాటికి సంబంధించిన ప్రచారం కూడా  ముగిసింది.  


ఈ నెల 21వ తేదీన  హుజూర్‌ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికకు ప్రచారం ముగిసింది. ఈ ఉప ఎన్నికతోపాటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వాటికి సంబంధించిన ప్రచారం కూడా  ముగిసింది. 18 రాష్ట్రాల్లోని మరో 63 సీట్లకు, హుజూర్ నగర్ తో కలుపుకొని 64 సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 21న పోలింగ్, 24న కౌంటింగ్ చేసి ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. 

హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయానికి వస్తే  తెరాస, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన కీలక నేతలు ఈ ఎన్నికల  ప్రచారంలో పాల్గొన్నారు.ఎవరికివారు ప్రత్యర్థి ఉయ్యూహాలను చిత్తు చేసేందుకు ఎన్నెన్నో వ్యూహాలు రచించారు. 

ఈ అసెంబ్లీ స్థానం నుండి 2009 నుండి వరుసగా మూడు దఫాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో నల్గొండ నుండి ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించాడు. దీంతో  ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో ప్రచార బరిలోకి దిగిన అధికార టీఆర్‌ఎస్‌ ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తుండగా మూడుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్‌ మరో విజయం కోసం చెమటోడుస్తోంది. మరోవైపు ఉప పోరు బరిలో నిలిచిన బీజేపీ, టీడీపీ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.  ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా ప్రత్యేక పరిశీలకుడు భాస్కరన్‌ నేతృత్వంలోని అధికార యంత్రాగం ప్రత్యేక నిఘా పెట్టింది.

ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని భావించినా కూడ వాతావరణం అనుకూలించకపోవడంతో కేసీఆర్ సభ రద్దైంది. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ తో పాటు పలువురు కాంగ్రెస్ కీలకనేతలు హుజూర్ నగర్ లోనే మకాం వేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడ ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపించిన సంక్షేమ పథకాలు, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం లాంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. ప్రధానంగా తమ ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిపెట్టిన రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ల వల్ల సామాన్యులకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సతీమణి పద్మావతిని గెలిపిస్తే వారి కుటుంబానికి తప్ప నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి తన ప్రచారంలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.

 మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తమ హయాంలో నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తోంది. లింకు రోడ్లు, లిఫ్టులు, సబ్‌స్టేషన్లు, వాటర్‌ ట్యాంకుల నిర్మాణం తమ హయాంలోనే జరిగిందని ఓటర్లకు గుర్తుచేస్తోంది. గతంలో తాము చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తోంది. 

ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీ, టీడీపీ అభ్యర్థుల గెలుపోటములను పక్కనపెడితే వారికి వచ్చే ఓట్ల వల్ల టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఎవరికి నష్టమన్న అంశంపై చర్చ జరుగుతోంది.

 బీజేపీ అభ్యర్థిగా పెరిక సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌ కోట రామారావు, టీడీపీ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన చావా కిరణ్మయి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,36,646 ఓటర్లున్నారు. ఈ నెల 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్ నుండి ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది.

click me!
Last Updated Oct 19, 2019, 5:18 PM IST
click me!