ఈటెల నుంచి శాఖ ఔట్: కేసీఆర్ ఇటీవలి వ్యాఖ్యల ఆంతర్యం అదేనా...

By telugu teamFirst Published May 1, 2021, 2:57 PM IST
Highlights

ఈటెల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖను తన చేతిలోకి తీసుకున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖను తానే నేరుగా పర్యవేక్షిస్తానని ఆయన ఇటీవల అన్నారు.

హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ఈటెల రాజేందర్ నుంచి బదిలీ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తన చేతిలోకి తీసుకున్న నేపథ్యంలో ఇటీవలి పరిణామాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై ప్రకటన చేస్తూ కేసీఆర్ ఓ మాట అన్నారు ఇక వైద్య ఆరోగ్య శాఖను నేరుగా తానే పర్యవేక్షిస్తానని అన్నారు. 

ఈటెల రాజేందర్ ను తప్పించాలనే నిర్ణయం అప్పటికే జరిగిందా అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈటెల రాజేందర్ మీద చాలా కాలంగా కేసీఆర్ వేటు వేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఈటెల రాజేందర్ మీద అసైన్డ్ భూముల అక్రమ కబ్జా ఆరోపణలు వచ్చిన వెంటనే కేసీఆర్ విచారణకు ఆదేశించారు. దాంతో బహుశా, ఈటెల రాజేందర్ మంత్రి పదవికి రాజీనామా చేస్తారని కేసీఆర్ భావించి ఉంటారు. కానీ తాను మంత్రి పదవికి రాజీనామా చేయబోనని ఈటెల రాజేందర్ చెప్పారు. 

రాజేందర్ మంత్రి పదవికి రాజీనామా చేయబోరని తెలుసుకున్న కేసిఆర్ శాఖను ఆయన నుంచి తొలగించినట్లు భావిస్తున్నారు. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. అయితే, ఈటెల రాజేందర్ కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. వ్యాక్సిన్ సరఫరా విషయంలో ఆయన కేంద్రంపై విమర్శలు చేశారు. అది కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈటెల రాజేందర్ తప్పించడానికి ఓ కారణంగా చెబుతున్నారు. 

ఇక వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారాలను కేసీఆర్ స్వయంగా చూడనున్నారు. కరోనా అలజడి మొదలైనప్పటి నుంచి ఈటెల రాజేందర్ చురుగ్గా కదులుతూ పనిచేస్తూ వస్తున్నారు. ఇటీవల ఒడిశా నుంచి ఆక్సిజన్ ను తెప్పించడానికి హైదరాబాదు నుంచి ఈటెల రాజేందర్ యుద్ధ విమానాలను పంపించారు. ఈటెల రాజేందర్ చొరవను మంత్రి, కేసీఆర్ తనయుడు అబినందించారు కూడా. 

ప్రస్తుతం కేటీఆర్ కరోనాకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. ఆయన ఈటెల వ్యవహారంపై స్పందిస్తారా, లేదా అనేది తెలియడం లేదు. కాగా, రాజేందర్ నుంచి శాఖను తొలగించిన కేసీఆర్ తదుపరి చర్య ఏం తీసుకుంటారనే అసక్తి కలుగుతోంది. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిందే. ఈటెల రాజేందర్ ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరమైన విషయంగా మారింది.

click me!